హైదరాబాద్: దశాబ్దం క్రితమే వీసా గడువు ముగిసినప్పటికీ అక్రమంగా నివాసముంటున్న నైజీరియన్ జాతీయుడిని (Nigerian) హైదరాబాద్ నార్కోటిక్ వింగ్ పోలీసులు (H-NEW) అరెస్టు చేశారు. జాన్కెన్నెడీ చుక్వుమెక ఒకారో (43) అనే నైజీరియన్ 2012లో బిజినెస్ వీసాపై ముంబైకి వచ్చాడు. అక్కడి నుంచి బెంగళూరుకు, అటుపై హైదరాబాద్‌కు మకాం మార్చాడు. వస్త్ర వ్యాపారం చేస్తున్నట్లు నమ్మించి మాదకద్రవ్యాల స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నాడు. దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకొని కొకైన్, హెరాయిన్, ఓజీ వంటి ఖరీదైన డ్రగ్స్‌ను పెద్దమొత్తంలో చేరవేస్తూ వచ్చిన సొమ్ముతో విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డాడు.
పదేండ్ల క్రితమే వీసా, పాస్‌పోర్ట్ గడువు ముగిసినా పోలీసుల కన్నుగప్పి మారుపేర్లతో తప్పించుకుంటున్నాడు. నైజీరియన్ స్మగ్లర్లతో సంబంధాలు పెంచుకొని హైదరాబాద్, బెంగళూరుల్లోని పెడ్లర్స్‌కు డెడ్‌డ్రాప్ పద్ధతిలో సింథటిక్ డ్రగ్స్ చేరవేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇతడిని ఆసిఫ్‌నగర్ పోలీసుల సహాయంతో హెచ్‌న్యూ వింగ్ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో అసలు గుట్టు బయటపడింది. అయితే అతని వద్ద ఎలాంటి డ్రగ్స్ లభించలేదని అధికారులు వెల్లడించారు. అనంతరం అతడిని స్వదేశానికి డిపోర్టేషన్ చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి నైజీరియాకు పంపించారు.