Newzealand Test Series | టీ20 ప్రపంచకప్ నుంచి వట్టి చేతులతో తిరిగొచ్చిన టీమిండియా న్యూజిల్యాండ్‌తో సిరీస్‌కు సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలోనే కివీస్‌తో జరిగే మూడు టీ20లకు జట్టును ప్రకటించింది. టీ20 కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ ఈ ప్రపంచకప్ తర్వాత తప్పుకున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో కెప్టెన్‌గా రోహిత్ శర్మను ఎంపిక చేసిన బీసీసీఐ.. వైస్ కెప్టెన్ పోస్టును రాహుల్‌కు అప్పగించింది. ఈ టీ20లు జరిగిన తర్వాత కివీస్‌తో రెండు టెస్టు మ్యాచ్‌లు ఉన్నాయి. వీటిలో తొలి టెస్టులో సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
దీంతో తొలి టెస్టు కెప్టెన్సీ బాధ్యతలను అజింక్య రహానేకు అప్పగించనున్నట్లు సమాచారం. గడిచిన పదేళ్లలో స్వదేశంలో జరిగిన టెస్టుల్లో టీమిండియా చాలా అరుదుగానే ఓడిపోయింది. దీనికన్నా ప్రధానంగా ఇంగ్లండ్‌లో జరిగిన టెస్టు సిరీస్‌లో రహానే చాలా ఘోరమైన ప్రదర్శన కనబరిచాడు. దీంతో అతన్ని టెస్టు జట్టు నుంచి తప్పించాలనే డిమాండ్లు కూడా వినిపించాయి.
అలాంటి సమయంలో టెస్టు జట్టు కెప్టెన్సీ బాధ్యతలు అతనికి దక్కడం రహానే అదృష్టమని చెప్పవచ్చు. అతను గనుక విమర్శలకు బ్యాటుతో సమాధానం చెప్తే టెస్టు జట్టులో అతని స్థానానికి ఢోకా ఉండదు. న్యూజిల్యాండ్‌తో జరిగే తొలి టెస్టులో రోహిత్ శర్మ, విరాట్ వంటి సీనియర్లకు విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో తన సత్తా నిరూపించుకునేందుకు రహానేకు ఇది సువర్ణావకాశమే.
ఇప్పటికే న్యూజిల్యాండ్‌తో జరిగే టీ20 మ్యాచులకు కోహ్లీ దూరమైన సంగతి తెలిసిందే. అసలు తొలి టెస్టు కెప్టెన్సీ బాధ్యతలను కూడా టీ20 కెప్టెన్ రోహిత్‌కే అప్పగించాలని తొలుత జట్టు మేనేజ్మెంట్ భావించిందట. కానీ అతనికి మరింత విశ్రాంతి ఇవ్వాలనే భావనతో రోహిత్‌ను రెండు టెస్టులు ఆడే జట్టు నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. రెండో టెస్టు సమయానికి కోహ్లీ జట్టుతో చేరనున్నాడు. ఆ టెస్టులో అతనే జట్టుకు సారధ్య బాధ్యతలు నిర్వహిస్తాడని సమాచారం.