Ration Cards | భద్రాద్రి కొత్తగూడెం : కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల విషయంలో కాంగ్రెస్ సర్కార్ మళ్లీ తన నిర్లక్ష్యాన్ని బయటపెట్టుకుంది. కొత్త రేషన్ కార్డుల కోసం ఇప్పటికే ప్రజాపాలన, గ్రామసభల్లో దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం.. తాజాగా ఆన్లైన్లో మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. మీ సేవ ద్వారానే రేషన్ కార్డుల్లో పేర్ల చేర్పులు, మార్పులు చేసుకోవచ్చని తెలిపింది. కానీ అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లను మాత్రం చేయలేదు.
కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు కోసం ప్రజలు మీ సేవ సెంటర్కు వెళ్తే ఆ సర్వీసు అందుబాటులో లేదని చూపిస్తున్నది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడటంతో హడావుడిగా కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని ఆలోచన చేసి.. చివరి నిమిషంలో దాన్ని రద్దు చేశారని విమర్శిస్తున్నారు. అలాంటప్పుడు ఎందుకు ఉత్తర్వులు ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. నాలుగు గ్యారంటీలు అమలు చేస్తున్నామని.. ప్రజాపాలన గ్రామసభలు పెట్టి విచ్చలవిడిగా దరఖాస్తులు తీసుకుని వాటిని గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైలట్ గ్రామాల్లో ఇస్తామన్న రేషన్ కార్డులు ఎటు పోయాయని.. మళ్లీ ఇప్పుడు దరఖాస్తు చేసుకోమంటున్నారని నిలదీస్తున్నారు.