హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 21 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కొత్త విద్యుత్తు పంపిణీ సంస్థ (డిస్కమ్) ఏర్పాటుతో కొత్త పంచాయితీకి తెర లేచింది. చాంబర్లు, అధికారుల కేటాయింపు విషయమై దక్షిణ డిస్కమ్ (టీజీఎస్పీడీసీఎల్)కు, కొత్తగా ఏర్పాటైన రైతు డిస్కమ్ (టీజీఆర్పీడీసీఎల్)కు మధ్య పంచాయితీ మొదలైంది. రైతు డిస్కమ్‌కు ప్రభుత్వం వసతులు కల్పించకపోవడం, మింట్ కాంపౌండ్‌లోని ఎస్పీడీసీఎల్ కార్పొరేట్ ఆఫీసులోనే రైతు డిస్కమ్ కార్యకలాపాలు నిర్వహించాలని ఎనర్జీ సెక్రటరీ ఆదేశించడంతో పాత, కొత్త సీఎండీల మధ్య గొడవ రాజుకున్నది. సీనియర్, జూనియర్ అన్న పేరుతో రైతు డిస్కమ్ సీఎండీ ముషారఫ్, ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేశ్ వీ పాటిల్ మధ్య ఆధిపత్యపోరు కొనసాగుతున్నది. కొత్త డిస్కమ్ ఏర్పాటయ్యాక సీఎండీలకు చాంబర్ల సర్దుబాటులో ఆలస్యం జరగడమే ఇందుకు కారణం. తాను సీనియర్‌ననే ఆలోచనలో ముషారఫ్ ఐదవ అంతస్తులోని తన పాత చాంబర్ (దక్షిణ డిస్కమ్ సీఎండీ చాంబర్)ను రైతు డిస్కమ్ సీఎండీ చాంబర్‌గా వినియోగిస్తున్నారు. ఈ చాంబర్‌ను దక్షిణ డిస్కమ్ సీఎండీకి ఇవ్వకపోవడంపై ఎస్పీడీసీఎల్ ఉద్యోగులు మండిపడుతున్నారు. గత నెల 26 నుంచి ఈ గొడవ కొనసాగుతున్నది. దీంతో ఆ ఇద్దరు సీఎండీలు సీట్ల పంచాయితీతోనే కాలం గడిపేస్తారా? వినియోగదారులు, రైతుల సమస్యలను పట్టించుకోరా? ఇదేం గోల? రైతు డిస్కమ్‌కు అవసరమైన వసతులు కల్పించకుండా ఇద్దరినీ ఒకే భవనంలో ఉంచి చోద్యం చూస్తున్న ప్రభుత్వానికి చెడ్డపేరు రావడం లేదా? అని సీనియర్ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.
రెండు డిస్కమ్‌ల మధ్య చాంబర్ల పంచాయితీతోపాటు అధికారుల కేటాయింపులోనూ గొడవలు జరుగుతున్నాయి. రైతు డిస్కమ్‌కు నాలుగు కంపెనీల నుంచి అధికారులను డిప్యుటేషన్‌పై పంపాలని కోరుతూ సీఎండీ ముషారఫ్ ఆయా కంపెనీల ఉన్నతాధికారులకు లేఖలు రాశారు. దీంతో ఆయన ఎస్పీడీసీఎల్ నుంచి కోరుకున్న 39 మంది అధికారులను డిప్యుటేషన్‌పై పంపుతూ సీఎండీ పాటిల్ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై ఆ అధికారులు మండిపడుతున్నారు. తమ అంగీకారం తీసుకోకుండా డిప్యుటేషన్‌పై ఎలా పంపిస్తారని వారంతా తమ యూనియన్ నేతలతో కలిసి హెచ్ఆర్ సెక్షన్ అధికారులను ప్రశ్నించడంతో.. ప్రస్తుతానికి ఈ సర్దుబాట్లు తప్పవని, పదిరోజుల్లో అన్నీ సర్దుకుంటాయని చెప్పినట్టు తెలిసింది. డిప్యుటేషన్‌పై పంపిన అధికారుల్లో ఇద్దరు మరికొద్ది నెలల్లో ఉద్యోగ విరమణ పొందనున్నారు. కానీ, వారికి కూడా ఏడాదిపాటు డిప్యుటేషన్ ఉన్నదంటూ ఉత్తర్వులు ఇవ్వడంతో ఇదేం విడ్డూరమని ఇతర అధికారులు ప్రశ్నిస్తున్నారు.
ఎస్పీడీసీఎల్ నుంచి బదిలీపై వెళ్లి రైతు డిస్కమ్‌లో బాధ్యతలు తీసుకున్నవారు ఎక్కడ కూర్చోవాలన్నది కూడా గందరగోళంగా మారింది. వారిలో కొందరు తమ చాంబర్లలో కూర్చున్నప్పటికీ అక్కడ రైతు డిస్కమ్ బోర్డు పెట్టుకోవాలో లేక కొత్త చాంబర్ కేటాయిస్తారో తెలియక అయోమయంలో ఉన్నారు. వారి స్థానంలో అదనపు బాధ్యతలు స్వీకరించినవారి పరిస్థితి కూడా అగమ్యగోచరంగా ఉంది. దక్షిణ డిస్కమ్ నుంచి బదిలీ అయిన అధికారుల్లో కొందరు ఇప్పటికీ రైతు డిస్కమ్ విధుల్లో చేరలేదు. తర్వాతైనా వారు ఆ విధుల్లో చేరుతారా? లేక పాత స్థానంలోనే కొనసాగుతారా? అనేది సోమవారం తెలిసే అవకాశం ఉన్నది.
దక్షిణ డిస్కమ్‌లో ఇప్పటికీ పాత సీఎండీ ముషారఫ్ పేరుతోనే ఆదేశాలు వెలువడుతున్నాయి. ఇటీవల డిప్యూటీ సీఎం ఇంటికి ఇద్దరు డ్రైవర్లను డిప్యుటేషన్‌పై పంపిస్తూ ఇచ్చిన ఆదేశాల్లో సీఎండీగా ముషారఫ్ పేరే ఉన్నది. తాజాగా మెట్రోజోన్ సీఈ ఇచ్చిన ఓసీ ఉత్తర్వులను సైతం పాత సీఎండీ ఆదేశాల మేరకే ఇస్తున్నట్టు ఉన్నది. ఇవి వాస్తవమేనా అని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తే మెట్రోజోన్ సీఈ అందుబాటులోకి రాలేదు.