ఇజ్రాయెల్ ఒత్తిడితో ఇరాన్‌పై కయ్యానికి కాలు దువ్విన అమెరికా పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారైంది. సుదీర్ఘ కాలం యుద్ధాన్ని కొనసాగించలేక, నిలిపివేయలేక అగ్రరాజ్యం సతమతమవుతున్నది. మిత్రదేశాల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో సంకటాన్ని ఎదుర్కొంటున్నది. బయట నుంచి వ్యతిరేకత సంగతి అటుంచితే, ఇప్పుడు సొంత సైన్యంలోనే తిరుగుబాటు మొదలైంది. అమెరికాకు చెందిన అతిపెద్ద యుద్ధనౌకను సొంత సైనికులే తగలబెట్టే స్థాయి ఉపద్రవం అమెరికాను ఆలోచనలో పడేసింది.
అగ్రరాజ్యం, ప్రపంచ దేశాల పెద్దన్నగా పేరొంది, ఆధిపత్యంతో, సామ్రాజ్యవాద కాంక్షతో రగిలిపోయే అమెరికా పరువుపోయే పరిస్థితి వచ్చింది. అంతా నా ఇష్టం.. నేను చెప్పిందే శాసనం.. నా మనఃసాక్షికి మాత్రమే నేను జవాబుదారీ అంటూ విర్రవీగుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇప్పుడు ఊహించని షాక్ తగిలింది. ఇరాన్ యుద్ధంలో పాల్గొంటున్న నౌకాదళ సైనికులు తిరుగుబాటు జెండా ఎగురవేశారు.
ఇరాన్‌పై యుద్ధంలో కీలక పాత్ర పోషిస్తున్న అమెరికాకు చెందిన అతిపెద్ద యుద్ధనౌక యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్.ఫోర్డ్లో మంటలు చెలరేగాయి. ఇది అగ్ని ప్రమాదం అని అమెరికా బయటకు చెప్తున్నది. కానీ ఈ మంటలు మామూలు మంటలు కాదని, సైనిక తిరుగుబాటు ఆగ్రహ జ్వాలలు అని విశ్వసనీయవర్గాల సమాచారం ఆధారంగా ప్రఖ్యాత మీడియా సంస్థలు కథనాలు వెలువరిస్తున్నాయి. అమెరికా నావికాదళ దర్యాప్తు సంస్థ కూడా నౌకలో జరిగిన ఘటనపై తిరుగుబాటు కోణంలో విచారణ చేపట్టింది.
యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా గ్యాస్, చమురు కొరత ఏర్పడింది. ధరలు భారీగా పెరిగిపోయి ఆర్థిక వ్యవస్థలు దుర్భరంగా మారాయి. దీనంతటికీ కారణమైన అమెరికా పట్ల చిరకాల మిత్రదేశాలు, గల్ఫ్ దేశాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. అంతేకాకుండా అగ్రరాజ్యానికి దూరం జరుగుతున్నాయి. ఇదంతా ప్రపంచ వ్యాప్తంగా అమెరికా ఎదుర్కొంటున్న పరిస్థితి. అంతేకాకుండా ఇప్పుడు సొంత సైన్యంలోనే తిరుగుబాటు మంటలు రగులుతున్నాయి. ఇరాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో నెలల తరబడి విధుల్లో ఉన్న సైనికులు విసిగివేసారిపోయారు. ఇదే సమయంలో యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్.ఫోర్డ్ యుద్ధనౌకలో అగ్నికీలలు ఎగిసిపడ్డ ఘటనలో కుట్ర కోణం ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. సైనికులు ఇంటికి తిరిగి రావాలనే ఆలోచనలో ఇలాంటి చర్యకు పాల్పడి ఉండారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్.ఫోర్డ్లో అగ్నికీలలు ఎగిసిపడటం సైనిక తిరుగుబాటు అనేది కేవలం పుకారు లేదా ప్రచారం ఎంతమాత్రం కాదు. ఈ వ్యవహారంపై విశ్వసనీయ సమాచారం ఉన్నట్టుగా ది న్యూయార్క్ టైమ్స్, ఫస్ట్‌పోస్ట్, గ్రీక్సిటీ టైమ్స్ కథనాలు ప్రచురించాయి. ఇదే విషయంపై అమెరికా నావికాదళం స్పందిస్తూ మార్చి 12న యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్.ఫోర్డ్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగినట్టుగా నిర్ధారించింది. మంటలు ముందుగా నౌక పక్క భాగంలోని లాండ్రీలో మొదలయ్యాయని పేర్కొన్నది. మంటలు 30 గంటల పాటు కొనసాగాయని, మొత్తం 600 మంది సైనికులు నివసించే గదులు దగ్ధమయ్యాయని స్పష్టంచేసింది. అదేవిధంగా దట్టమైన పొగ వల్ల ఇద్దరు సైనికులు గాయపడ్డారని వెల్లడించింది. అమెరికాకు చెందిన యుద్ధనౌకలలో యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్.ఫోర్డ్ కొత్తది, ఖరీదైనది. దీని విలువ సుమారు 13 బిలియన్ డాలర్లు (రూ.1.1లక్షల కోట్లు). అయితే మంటలు వ్యాపించడానికి ముందుగా గుర్తుతెలియని వ్యక్తులు వాక్యూమ్ టాయిలెట్స్‌ను టీషర్ట్స్, తాళ్లతో మూసివేసినట్టు తెలుస్తున్నది. దీంతో ప్రమాద తీవ్రత పెరిగిందని మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది శ్రమించాల్సి వచ్చిందని వివరించింది. అమెరికా నావికాదళ నేర దర్యాప్తు సంస్థ (ఎన్సీఐఎస్) కుట్ర కోణంలో విచారణ చేపట్టింది. నౌకను మరమ్మతుల కోసం గ్రీక్‌కు తీసుకెళ్లాల్సి ఉన్నట్టు అమెరికా నౌకాదళ అధికారులు చెప్తున్నారు.
అమెరికా సైనికులు ఇరాన్‌పై ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ సన్నాహాలు జరుగుతున్నప్పటి నుంచి పది నెలలుగా నౌకలోనే ఉన్నారు. నిరంతర ఆజ్ఞలు, హోర్ముజ్ జలసంధి వద్ద క్షిపణి ముప్పు, విధులు పొడగించడం, సెలవులు లేకపోవడంతో సైనికులు తీవ్ర అసహనంతో ఉన్నారు. ఈ తతంగమంతా వదిలేసి ఇంటికి వెళ్లిపోదామనే ఉద్దేశంతో ఉన్నట్టు వాదన వినిపిస్తున్నది. ఇదే విషయంపై ఇరాన్ ప్రసార మాధ్యమాల్లో భయపడ్డ అమెరికన్లు సొంత యుద్ధనౌకను తగలబెట్టుకున్నారు అని కథనాలు ప్రసారమవుతున్నాయి. సైనికుల తీవ్ర అలసటే ప్రధాన కారణమని అమెరికా మీడియావర్గాల్లో వాదన వినిపిస్తున్నది.
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం గురించి భారతీయ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. ఇదంతా ఎక్కడో జరుగుతున్న పరిణామాలుగా చూడనక్కరలేదు. ఏ యుద్ధం వల్లనైతే అమెరికా సైనికులు అలసిపోయారో, అదే యుద్ధం మన దేశంలో చమురు, ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై ప్రభావం చూపుతుంది. భారత్ దిగుమతి చేసుకుంటున్న ఎల్పీజీలో 80-85% ఎల్పీజీ, చాలా వరకు ముడి చమురు, ఎల్ఎన్జీ గల్ఫ్ నుంచి హోర్ముజ్ జలసంధి మీదుగా దిగుమతి అవుతుంది. దిగుమతికి ఆటంకం ఏర్పడితే యుద్ధం ప్రభావం మన వంట గదులు, ప్రయాణాల మీద కూడా పడుతుంది.ఇజ్రాయెల్‌కు మద్దతుగా ఇరాన్‌పై అమెరికా దాడులు ప్రారంభించింది. ఇరాన్ అణు ఇంధన కేంద్రాలను ధ్వంసం చేసి, ఆ దేశ నాయకత్వాన్ని తొలగించాలనే లక్ష్యంతో రంగంలోకి దిగింది.
గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, బహ్రెయిన్‌లో వేలాది మంది అమెరికా సైనికులు ఉన్నారు. కానీ యుద్ధం గురించి అమెరికా తమకు సమాచారం ఇవ్వలేదని ఆయా గల్ఫ్ దేశాలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నాయి. ఇదే నేపథ్యంలో ఇరాన్ జరిపిన క్షిపణి ప్రతిదాడులు గల్ఫ్ దేశాల భూభాగాలను తాకాయి. ఈ దాడుల నుంచి రక్షించుకునేందుకు గల్ఫ్ దేశాలు తమ సొంత రక్షణ వ్యవస్థలను వినియోగించుకోవాల్సి వచ్చింది. అమెరికా మాత్రం కేవలం ఇజ్రాయెల్‌ను రక్షించడంపైనే దృష్టి సారించింది.
ఇప్పుడు చాలావరకు గల్ఫ్ దేశాలు ఇరాన్‌తో చర్చలు జరుపుతున్నాయి. అమెరికా వైఖరి పట్ల ఫిర్యాదు చేస్తున్నాయి. అమెరికా తమను ఒంటరిని చేసి వదిలేసినట్టు చెప్పుకొంటున్నాయి. మరోవైపు యూరోపియన్ యూనియన్ మిత్ర దేశాలు కూడా దాడులు ఆపాలని, చర్చలు జరపాలని కోరుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా మిత్రబలం క్రమంగా తగ్గుతున్నది. విమాన వాహక నౌకలు అమెరికా సైనిక శక్తికి ప్రతీకలు. వీటిలో గెరాల్డ్ ఆర్.ఫోర్డ్ ఒక కీర్తి కిరీటం వంటిది. అణు ఇంధనంతో నడిచే ఈ యుద్ధనౌక 75 ఫైటర్ జెట్స్‌ను మోసుకెళ్తుంది. ఇందులో 5000 మంది నావికులు ఉంటారు. అమెరికా నిమిట్జ్ క్లాస్ యుద్ధనౌకలైన అబ్రహాం లింకన్, రొనాల్డ్ రీగన్ నౌకలను ఇరాన్ సమీపంలో దశాబ్దాలపాటు మోహరించింది. ఇటీవల మూడు యుద్ధనౌకలను పంపింది. తమను ఎవరూ ఏమీ చేయలేరని, ఓడించడం అసాధ్యమని బలం చాటుకోవడమే అమెరికా ఉద్దేశం. కానీ గెరాల్డ్ ఆర్.ఫోర్డ్ కథనం మరో పాఠం చెప్తున్నది. యంత్రాలు ఎంత శక్తిమంతమైనవైనా, వాటిని నడిపే మనుషులు విసిగిపోతే వ్యవస్థ కుప్పకూలుతుంది. అలాగే అమెరికా సైనికులు బహిరంగంగా తిరుగుబాటు చేయకపోయినా నిశ్శబ్దంగా విధ్వంసానికి పాల్పడినట్టు తెలుస్తున్నది. దీంతో అమెరికా రక్షణ గోడకు ఒక చిల్లు పడిందని నిపుణులు అభివర్ణిస్తున్నారు.
అమెరికా సైన్యంలో ఇలాంటి నిశ్శబ్ద తిరుగుబాట్లు ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా సుదీర్ఘ యుద్ధాలు జరుగుతున్నప్పుడు అగ్రరాజ్య సైన్యంలో తిరుగుబాట్లు జరిగాయి. 1960-70లలో వియత్నాం యుద్ధం సమయంలో అమెరికా సైనికులు అలసిపోయి, సొంత సైనిక అధికారులపైనే గ్రనేడ్స్ విసిరారు. 1969-72 మధ్య కాలంలో ఇలాంటి 904 ఘటనలు జరగగా 86 మంది అధికారులు మరణించారు. వియత్నాం యుద్ధం తర్వాత సుదీర్ఘమైన యుద్ధాలు ఉండబోవని, సైనికుల రొటేషన్ పద్ధతి అమలు చేస్తామని అమెరికా ప్రభుత్వం తమ సైన్యానికి చెప్పింది. కానీ మళ్లీ ఇరాక్, అఫ్గనిస్థాన్‌తో సుదీర్ఘ యుద్ధాలు జరిపింది. అమెరికా సైనికులు కొందరు ఆత్మహత్యలు చేసుకోగా, మరికొందరు పారిపోయారు. మళ్లీ ఇప్పుడు గెరాల్డ్ ఆర్.ఫోర్డ్లో చెలరేగిన మంటలు ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. యుద్ధంలో జరిగే ప్రాణనష్టాన్ని దేశాల నాయకత్వాలు మర్చిపోతే బలమైన సైన్యాలు, యుద్ధనౌకలు కూడా నిశ్శబ్దంగా తిరుగుబాటు చేస్తాయి.