హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): ఇన్నాళ్లూ థర్మల్, హైడల్ విద్యుత్తు ప్లాంట్ల నిర్మాణం, నిర్వహణకే పరిమితమైన టీజీజెన్కో సోలార్ విద్యుత్తు రంగంలోకి పునఃప్రవేశించనున్నది. 245 మెగావాట్ల ప్లాంట్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. అందులో భాగంగా టీజీజెన్కోకు చెందిన థర్మల్, హైడల్ పవర్ ప్లాంట్లల్లో రూఫ్టాఫ్, ఫ్లోటింగ్, గ్రౌండ్ మౌంటెడ్ ప్లాంట్లను నెలకొల్పేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. జెన్కోకు చెందిన భవనాలపై 186, భూపాలపల్లిలో 8, జూరాలలో 25, పులిచింతలలో 11, కొత్తగూడెంలో 13, కేటీపీఎస్ 7వ దశలో 4 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నది. సౌర విద్యుత్తు రంగంలో జెన్కో దశాబ్దాల క్రితమే ప్రవేశించినప్పటికీ ఉత్పత్తి సామర్థ్యం ఒక మెగావాట్ మాత్రమే. ఆ తర్వాత నిర్మాణ వ్యయం పెరగడంతో సోలార్ ప్లాంట్ల ఏర్పాటును పక్కన పెట్టింది. ఇటీవలి కాలంలో ప్లాంట్ల నిర్మాణ వ్యయం తగ్గడంతో సింగరేణి సహా అనేక ప్రైవేట్ కంపెనీలు సోలార్ విద్యుత్తు రంగంలోకి ప్రవేశించాయి. ప్లాంట్లను ఏర్పాటు చేసి విజయవంతంగా నడుపుతున్నాయి. ఇప్పుడు జెన్కో సైతం ఆలస్యంగా మేల్కొని సోలార్ విద్యుత్తు రంగంలో పెట్టుబడులు పెట్టనున్నది. 2023-24 వరకు 6,486 మెగావాట్లుగా ఉన్న జెన్కో స్థాపిత విద్యుత్తు సామర్థ్యం.. యాదాద్రి థర్మల్ ప్లాంట్లోని యూనిట్లు క్రమంగా అందుబాటులోకి వస్తుండటంతో ప్రస్తుతం 8,823 మెగావాట్లకు చేరింది.
స్థాపిత విద్యుత్తులో 35% ప్రైవేట్దే
రాష్ట్ర మొత్తం స్థాపిత విద్యుత్తు సామర్థ్యం 23,187 మెగావాట్లు కాగా.. దీంట్లో 11,099 మెగావాట్లు జెన్కో, సింగరేణి వంటి సంస్థలకు చెందినది. ప్రైవేట్ రంగంలో 8,279 మెగావాట్లు ఎన్టీపీసీ లాంటి ప్లాంట్లలో 3,809 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతున్నది. మొత్తం స్థాపిత విద్యుత్తు సామర్థ్యంలో ప్రభుత్వం రంగం వాటా 47.9%, ప్రైవేట్ రంగం వాటా 35%, కేంద్ర ప్రభుత్వ ప్లాంట్ల వాటా 16.4 శాతంగా ఉన్నది.
జెన్కో స్థాపిత విద్యుత్తు సామర్థ్యం
రంగం మెగావాట్లు