మామిళ్లగూడెం, డిసెంబర్ 1 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన మద్యం పాలసీ ప్రకారం దుకాణాల్లో లిక్కర్ అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 122 దుకాణాల్లో, భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా 88 దుకాణాల్లో నూతన మద్యం పాలసీ ప్రకారం రెండేళ్లపాటు అమ్మకాలు చేపట్టేందుకు ఇప్పటికే ఆయా దుకాణాల యజమానులకు అధికారులు లైసెన్సులు జారీ చేశారు. దీని ప్రకారమే దుకాణాలు వచ్చిన యజమానులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం మొదటి టర్మ్ లైసెన్సు ఫీజులను స్లాట్ ప్రకారం చెల్లించి వారు వైరా మద్యం డిపో నుంచి లిక్కర్ కొనుగోలు చేశారు. బుధవారమే దుకాణాలను ప్రారంభించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రస్తుతం దుకాణ వరించిన వారు తాత్కాలికంగా తమకు కేటాయించిన స్టాక్‌ను తమకు అనుకూలమైన స్థానంలో పెట్టి అమ్మకాలు చేసుకునేందుకు అధికారులు వీలు కల్పించారు. నిర్దేశించిన సమయంలో పక్కా దుకాణాన్ని ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏర్పాటు చేసుకునేందుకు వీలు కల్పించడంతో దుకాణదారులు తమ వ్యాపారాలను ప్రారంభించారు. దుకాణదారులు తప్పనిసరిగా ఎంఆర్పీ ప్రకారమే మద్యం విక్రయాలు జరపాలని జిల్లా ఉన్నతాధికారులు ఆదేశించారు.
నిబంధనలు ఇలా..
అమ్మకాలు ఇలా..
నూతన అమ్మకాల కోసం ఖమ్మం జిల్లా వ్యాపారులు 28,217 కేస్ల మద్యం, 9,794 కేస్ల బీర్లను రూ.19.24 కోట్లతో కొనుగోలు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి 17,264 కేస్ల మద్యం, 6,060 కేస్ల బీర్లను రూ.11.88 కోట్లతో కొనుగోలు చేశారు. మొత్తంగా రెండు జిల్లాల నుంచి 45,481 కేస్ల మద్యం, 15,854 కేస్ల బీర్లను రూ.31.13 కోట్లతో కొనుగోలు చేశారు. బఫర్ స్టాక్‌గా పెట్టుకునేందుకు వ్యాపారులు ముందస్తుగానే కొనుగోలు చేశారు.
రెండేళ్లలో రూ.2,800 కోట్ల ఆదాయం
ఉమ్మడి జిల్లా నుంచి రెండేళ్లలో మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం ప్రకారం రూ.2,800 కోట్ల ఆదాయం ఖజానాకు చేరింది. ప్రతి నెలా సగటున రూ.117 కోట్ల ఆదాయం లభించింది. ప్రస్తుతం నూతన పాలసీలో వ్యాపారులకు అమ్మకాల్లో రాయితీలు, ఫీజు చెల్లింపులో వెసులుబాటు కల్పించడంతోపాటు మద్యం అమ్మకాలను ప్రోత్సహించడంతో ఈ ఏడాది గతంలో కంటే ఎక్కువగానే ఆదాయం పెరిగే అవకాశం ఉందని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు.
నిబంధనలు పాటించాల్సిందే..
నూతన మద్యం పాలసీలో వ్యాపారులకు తెలంగాణ ప్రభుత్వం చాలా లాభదాయక సౌకర్యాలు కల్పించింది. నూతన మద్యం దుకాణాలన్నీ ప్రభుత్వ విధి విధానాలను తప్పక పాటించాలి. బినామీ మద్యం యజమానులపై నిఘా ఉంచుతాం. సిండికేట్‌గా వ్యాపారం చేస్తే కేసు నమోదు చేస్తాం. చట్టరీత్యా చర్యలు తీసుకోవడంతోపాటు లైసెన్సు రద్దు చేస్తాం. నిబంధనలు పాటించాల్సిందే. ఎంఆర్పీ ధరలకే మద్యం విక్రయించాలి. అధిక ధరలకు విక్రయిస్తే కఠినచర్యలు తీసుకుంటాం.
-సోమిరెడ్డి, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్