హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్)పై సమగ్ర అధ్యయనం జరపాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) కీలక నిర్ణయం తీసుకొన్నది. ఈ ఆనకట్ట అసలు ఉద్దేశం నెరవేరుతున్నదా? లేదా? నిర్ణీత కేటాయింపుల మేరకు ఆయా రాష్ర్టాలకు సాగునీరు అందుతున్నదా? లేదా అనే అంశాలపై పుణెలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో క్షుణ్ణంగా అధ్యయనం చేయించడంతోపాటు అవసరమైతే కొత్త బరాజ్ నిర్మాణాన్ని సైతం ప్రతిపాదిస్తామని కేఆర్ఎంబీ వెల్లడించింది. త్వరలో నిర్వహించే బోర్డు సమావేశంలో దీనిపై తెలంగాణ, ఏపీ, కర్ణాటకతో చర్చిస్తామని, ఆ తర్వాతే నిర్ణయం తీసుకొంటామని స్పష్టం చేసింది. ఆర్డీఎస్, సుంకేశుల బరాజ్‌ల వద్ద నీటి వినియోగంతోపాటు తెలంగాణ, ఏపీ రాష్ర్టాలు లేవనెత్తిన అభ్యంతరాలు, సమస్యలపై కేఆర్ఎంబీ జలసౌధలో బుధవారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. తెలంగాణ తరఫున అంతర్రాష్ట్ర జల మండలి చీఫ్ ఇంజినీర్ మోహన్‌కుమార్, ఎస్ఈ కోటేశ్వర్రావు, ఈఈ విజయ్‌కుమార్, వనపర్తి సీఈ రఘునాథరావు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆర్డీఎస్ వద్ద న్యాయంగా దక్కాల్సిన నీటి వాటాలో జరుగుతున్న నష్టంపై తెలంగాణ ప్రభుత్వం ఆది నుంచీ లేవనెత్తుతున్న అభ్యంతరాలను మరోసారి బలంగా వినిపించారు.
ఈ ప్రాజెక్టు హెడ్వర్స్స్ వద్ద కాలువ వాస్తవ సామర్థ్యం 850 క్యూసెక్కులని, తెలంగాణ భూభాగంలోకి వచ్చేసరికి 770 క్యూసెక్కులు ఉండాలని తెలిపారు. ప్రస్తుతం ఇది 400 క్యూసెక్కుల కంటే తక్కువకు పడిపోవడంతో తెలంగాణకు సాగునీరు అందడంలేదని వివరించారు. ప్రస్తుతం ఆనకట్ట నీటి నిల్వ సామర్థ్యం కూడా తగ్గిపోయిందని, వాస్తవంగా ఉండాల్సిన 15.90 టీఎంసీల్లో కనీసం 5.53 టీఎంసీలు కూడా అందుబాటులో ఉండటం లేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆర్డీఎస్ చివరి ఆయకట్టులోని 50వేల ఎకరాలకు నీరందించేందుకు తెలంగాణ ప్రభుత్వం తుమ్మిళ్ల లిఫ్ట్‌ను ఏర్పాటు చేసిందని స్పష్టం చేశారు. ఆర్టీఎస్ ప్రాజెక్టులో కర్ణాటక కంటే తెలంగాణ, ఏపీకే ఎక్కువ నీటి కేటాయింపులు ఉన్నందున ఈ ప్రాజెక్టు హెడవర్క్స్ మొత్తాన్ని కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకొని ఆధునీకరణ పనులను పూర్తి చేయాలని, ఆనకట్ట ఎత్తును పెంచాలని డిమాండ్ చేశారు. సాయంత్రం 4 గంటల వరకు సుదీర్ఘంగా సాగిన సమావేశంలో తెలంగాణ లేవనెత్తిన అంశాలకు కర్ణాటక సమ్మతించినప్పటికీ ఏపీ విభేదించింది.