Baba Ramdev : ఇరాన్ (Iran) పై అమెరికా (USA), ఇజ్రాయెల్ (Israel) చేస్తున్న యుద్ధంపై యోగా గురు, పతంజలి సహ వ్యవస్థాపకుడు బాబా రాందేవ్ (Baba Ramdev) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధంలో అమెరికా గెలువదని, ఇరాన్ ఓడిపోదని ఆయన అన్నారు. ప్రపంచ శాంతి స్థాపనలో భారత్ కీలకపాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. హరిద్వార్ (Haridwar) లోని పతంజలి యోగపీఠ్ (Yoga Peeth) లో ఇవాళ జరిగిన రామనవమి వేడుకల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
‘ఈ యుద్ధంలో అమెరికా గెలువదు, ఇరాన్ ఓడిపోదని నేను గతంలో చెప్పాను. 1000-1200 కిలోమీటర్ల నుంచి 4000-5000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించడం ద్వారా.. కేవలం ఆయుధాలను వినియోగించడం ద్వారా ఎవరూ ఎవరినీ భయపెట్టలేరని ఇరాన్ నిరూపించింది’ అని రాందేవ్ విశ్లేషించారు. ప్రజాస్వామ్యం అంటే ఇతరులను భయపెట్టడం కాదని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా గర్వపడే అమెరికా, ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని కూడా గౌరవించాలని చెప్పారు.
పశ్చిమాసియాలో సంక్షోభాన్ని పరిష్కరించడంలో భారత్ కీలకపాత్ర పోషించాలని రాందేవ్ ఆకాంక్షించారు. ‘వసుధైక కుటుంబం’ అనే సిద్ధాంతం ఆధారంగా ప్రపంచాన్ని ఏకతాటిపైకి తీసుకురావాలన్న సందేశాన్ని భారత్ ఇస్తూనే ఉండాలని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయంగా, దౌత్యపరంగా చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారని కొనియాడారు. ఎవరైనా మధ్యవర్తిత్వంతో యుద్ధం ఆపగలిగితే అది భారతే అన్నారు. ఈ యుద్ధం వల్ల తలెత్తిన పెట్రోల్, గ్యాస్ సంక్షోభానికి, ప్రపంచ ఆర్థిక మాంద్యానికి చర్చల ద్వారానే పరిష్కారం లభిస్తుందని చెప్పారు.
అదే సమయంలో శ్రీరామనవమి పర్వదినం ప్రాముఖ్యతను వివరిస్తూ.. దేశ ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. డిజిటల్ మీడియా ప్రభావంతో యువత, ముఖ్యంగా కుమార్తెల శీలం దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇలాంటి పండుగలను పిల్లల్లో మన గొప్ప సాంస్కృతిక వారసత్వంపై బలమైన అవగాహన కల్పించడానికి ఒక అవకాశంగా ఉపయోగించుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. దేశ విదేశాంగ విధానం లాంటి జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన విషయాల్లో అందరూ కలిసికట్టుగా ఉండాలన్నారు.