అమరావతి : బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ (Minister Srinivas Goud) గురువారం తిరుమలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు అనంతరం స్వామివారిని దర్శించుకుని మొక్కులను చెల్లించుకున్నారు. ఆలయం బయట ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో (Tirumala) టీటీడీ (TTD) అవలంభిస్తున్న వైఖరిని తప్పుబట్టారు.
దర్శనాలు, గదుల కేటాయింపులో తెలంగాణ భక్తులను (Telangana devotees) నిర్లక్ష్యం చేస్తుందని ధ్వజమెత్తారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఏకైక అనుసంధానం తిరుమలేనని పేర్కొన్నారు. గడచిన పది సంవత్సరాల తరువాత ఇరురాష్ట్రాల ప్రజలను టీటీడీ సమానంగా చూడడం లేదని ఆరోపించారు.
తిరుమలలో సామాన్యులకు, రాజకీయ నాయకులకు, వీఐపీలకు ఇచ్చే గౌరవంలో చాలా వ్యత్యసం కనబడుతుందని విమర్శించారు. అనుభవం ఉన్న చంద్రబాబు వీటిని గుర్తించి సరిచేయవలిసి అవసరం ఉందని సూచించారు. తెలంగాణలో ఎక్కువగా లబ్దిపొందింది ఆంధ్రవారేనని, కాంట్రాక్టర్లు, బిల్డర్లు వాళ్లే ఉన్నారని, ఆర్థికంగా బలపడ్డవారిలో ఆంధ్రవారే ఎక్కువగా ఉన్నారని వెల్లడించారు.