NEET PG 2026 : మెడికల్ విద్యార్థులకు 2026లో పీజీలో అడ్మిషన్ల కోసం నిర్వహించే నీట్ పీజీ ప్రవేశ పరీక్ష తేదీ వచ్చేసింది. ఆగష్టు 30న నీట్ పీజీ 2026 ప్రవేశ పరీక్ష జరగనుంది. ఇందుకోసం దరఖాస్తుల ప్రక్రియ జూలై 1 సాయంత్రం ఐదు గంటల నుంచి ప్రారంభమైంది. దరఖాస్తులు సమర్పించేందుకు చివరి తేదీ జూలై 21, రాత్రి 11.55 గంటలు. ఈ పరీక్షను ఎన్బీఈఎంఎస్ (నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్) సంస్థ నిర్వహిస్తుంది. ఇటీవల నీట్ యూజీ పేపర్ లీక్ నేపథ్యంలో పీజీలో ప్రవేశం కోసం అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
కాపీయింగ్ జరగకుండా చాలా రూల్స్ అమలు చేయనుంది ఎన్బీఈఎంఎస్. టెస్ట్ సిటీ కేటాయింపు రూల్స్ మార్చేశారు. అంటే ముందుగా దరఖాస్తు చేసుకున్నంత మాత్రాన కోరుకున్న సిటీలో ప్రవేశపరీక్ష రాసే అవకాశం ఉండదు. ఫస్ట్ కమ్.. ఫస్ట్ సర్వుడ్ బేసిస్ విధానం ఉండదు. అభ్యర్థులు పరీక్ష రాసేందుకు తప్పనిసరిగా మూడు రాష్ట్రాలను, అక్కడి సిటీలను ఎన్నుకోవాల్సి ఉంటుంది. వాటిలోంచే పరీక్ష రాసే సిటీలను కేటాయిస్తారు. ఆధార్ అథెంటికేషన్, బయోమెట్రిక్ రూల్స్‌ను తప్పనిసరి చేయనున్నారు. దీనికోసం విద్యార్థులు పరీక్ష రాసే సమయానికి చేతికి, వేళ్లకు హెన్నా, రంగులు వంటివి రాసుకుని ఉండకూడదు. ఇతరులతో అప్లికేషన్ వివరాలు పంచుకోకూడదు.
అభ్యర్థులకు ఆగష్టు 11 నుంచి అడ్వాన్స్‌గా ఎగ్జామినేషన్ సిటీకి సంబంధించిన వివరాలు అందుబాటులో ఉంటాయి. ఆగష్టు 30న ప్రవేశ పరీక్ష జరిగితే, సెప్టెంబర్ 30లోపు ఫలితాలు వెల్లడవుతాయి. దరఖాస్తు సందర్భంగా పరీక్షుక సంబంధించిన నియమ నిబంధనల్ని అభ్యర్థులు తప్పనసరిగా చదవాలని ఎన్బీఈఎంఎస్ సూచించింది. పూర్తి వివరాలకు సంబంధిత వెబ్‌సైట్‌ను సందర్శించాలి.