హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ):ఏపీ శాసనసభలో శుక్రవారం ఘటనలపై టీడీపీ అధినేత చంద్రబాబు మీడియా ఎదుట విలపించడంపై ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీపార్వతి స్పందించారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బాలకృష్ణతో పాటు ఎన్టీఆర్ కుటుంబసభ్యులంతా వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. తన భార్య భువనేశ్వరిని ఎవరో ఎదో అన్నారని చంద్రబాబు చెప్తే నమ్మడం సరికాదని, ఎన్టీఆర్ వారసులు మూర్ఖంగా ఎందుకు వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. దివంగత ఎన్టీఆర్ మహానుభావుడని, ఆయన చావుకు కారణం చంద్రబాబేనని పేర్కొన్నారు. చంద్రబాబు మోసగించాడని అప్పట్లో ఎన్టీఆర్ ఎం తచెప్పినా ఆయన కుటుంబసభ్యులు వినిపించుకోలేదని విమర్శించారు. దివంగత వైఎస్ కుటుంబంపై అసత్య ప్రచారం చేసిందీ, జగన్ను జైలుకు పంపిందీ చంద్రబాబేనని ఆరోపించారు. భార్యను అడ్డుపెట్టుకోవడం బాబు కు కొత్తేమీ కాదని మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్రావు వ్యాఖ్యానించారు. చంద్రబాబు టీడీపీలో చేరేందుకు తన భార్య ద్వారానే ఎన్టీఆర్పై ఒత్తిడి తెచ్చారని, చేర్చుకోకపోతే ప్రస వం కోసం భువనేశ్వరిని పుట్టింటికి పంపనని బెదిరించారని ఆరోపించారు. ఎన్టీఆర్ కుటుంబసభ్యుల గురించి తప్పుడు మాటలు మాట్లాడితే సహించేది లేదని ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ హెచ్చరించారు. ఆడవాళ్ల జోలికొస్తే చేతులు ముడుచుకొని కూర్చోబోమని పేర్కొన్నారు. మహిళల గురించి అసభ్యంగా మాట్లాడటం అరాచక పాలనకు నిదర్శనమని సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు. చట్టసభల్లో ప్రజల సమస్యలపై చర్చించకుండా వ్యక్తిగత దూషణలకు దిగడం మంచి పరిణామం కాదని పేర్కొన్నారు.