వరంగల్/నయీంనగర్, సెప్టెంబర్ 14 : పూటకో పార్టీ మారితే తాను కూడా ఐదుసార్లు ఎమ్మెల్యే అయ్యేవాడినని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి పేర్కొన్నా రు. ఆదివారం కార్పొరేటర్ల స్టడీ టూర్ బస్సులను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ వద్ద ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే రా జేందర్‌రెడ్డి మంత్రి సురేఖ వ్యాఖ్యలపై ఘాటు గా స్పందించారు. అవకాశవాద రాజకీయాలు చేయడం తనవల్ల కాదని, ఇచ్చిన మొదటి అవకాశాన్ని వినియోగించుకొని ఎమ్మెల్యేగా గెలిచానని చెప్పారు. 40 ఏండ్లుగా పార్టీ కోసమే పని చేశానని పేర్కొన్నారు. తన నియోజకవర్గ పరిధిలో ఉన్న భద్రకాళీ దేవాలయంపై మంత్రి పెత్తనమేమిటని మండిపడ్డారు. మంత్రి నియోజకవర్గం నుంచే ఏడుగురిని నియమిస్తే ఎలా అని ప్రశ్నించారు. మం త్రి స్థాయిలో ఉండి వ్యగ్యంగా మా ట్లాడటం, అదృష్టం కొద్దీ గెలిచారని అనడం సరైందికాదన్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ) : సొంత పార్టీపై సంచనల వ్యాఖ్యలు చేస్తున్న ము నుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై చర్యలు తీసుకునేందుకు క్రమశిక్షణ సంఘం వెనకాడుతున్నట్టుగా కనిపిస్తున్నది. ఆయన పై పార్టీకి గానీ, క్రమశిక్షణ సంఘానికిగానీ ఎలాంటి ఫిర్యాదు అందలేదని, అందుకే ఆయన విషయాన్ని పట్టించుకోవడం లేదని క్రమశిక్షణ సంఘం చైర్మన్ మల్లు రవి తెలిపారు. ఆదివారం గాంధీభవన్‌లో క్రమశిక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాజగోపాల్‌రెడ్డిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని విలేకరులు ప్రశ్నించగా.. ఆయనపై తమకు ఫిర్యాదు అందలేదని, ఫిర్యాదు వస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.