భారతీయ ప్రయాణీకులకు ఎయిర్పోర్ట్ లాంజ్‌లు ఎంతో సౌకర్యవంతంగా మారుతున్నాయి. ఉచితంగా ఆహారం, పానీయాలు, వైఫై, రిైక్లెనర్స్, చార్జింగ్ పాయింట్లేగాక.. కొన్నిసార్లు స్పా లేదా స్పీపింగ్ పాడ్స్ సదుపాయాలూ ఉంటున్నాయి మరి. దీంతో ప్యాసింజర్లకు లాంజ్‌లు అత్యంత ఆకర్షణీయంగా మారాయిప్పుడు. అయితే ఇవన్నీ నిజంగా విమాన ప్రయాణీకులకు ఉచితంగానే లభిస్తున్నాయా? లేదా పరోక్షంగా ఏమైనా చెల్లిస్తున్నామా? మరి ఎక్కడ్నుంచి.. ఎవరి దగ్గర్నుంచి వసూలు చేస్తున్నారు? దేశంలోని విమానాశ్రయాల్లోగల లాంజ్ల్లోకి వెళ్తే.. ప్రయాణీకులెవరూ తమ జేబుల్లో నుంచి ఒక్క పైసా కూడా తీయనక్కర్లేదు.
మీ క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డులనూ స్వైప్ చేయాల్సిన పని అంతకన్నా ఉండదు. అన్నీ ఉచితమే. అయితే హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, యాక్సిస్, ఎస్బీఐ లేదా రూపే తదితర కార్డులను వినియోగిస్తూ మీరు లాంజ్‌లోకి వెళ్లిన ప్రతిసారీ మీ తరఫున మీ కోసం సదరు బ్యాంక్ లేదా వీసా/మాస్టర్‌కార్డ్/అమెక్స్ వంటివి లాంజ్ నిర్వాహకులకు బిల్లులు చెల్లిస్తాయి. ఇవన్నీ కూడా మీ క్రెడిట్ కార్డ్ బెనిఫిట్ ప్యాకేజ్‌లో భాగమే. లాయల్టీగా ఈ ఖర్చులను అవన్నీ భరిస్తాయి. ఇక సాధారణంగా దేశంలో లాంజ్ ఖర్చు ఒక్కో ప్రయాణీకునికి ఒకసారికి రూ.600-1,200 మధ్య ఉంటుంది. విదేశీ లాంజ్‌లకు ఇది 25 డాలర్ల నుంచి 35 డాలర్లదాకా ఉంటుంది. ప్రయార్టీ పాస్ లేదా లాంజ్కీ వంటి నెట్‌వర్క్‌ల ద్వారా ఈ సౌకర్యాలను అందుకోవచ్చు. అప్పుడు క్విక్ సాండ్విచ్, కాఫీ ఖర్చులనూ ప్రయాణీకులు పెట్టుకోనవసరం లేదు.
ఇదీ సంగతి..
ఎక్కడైనాసరే లాంజ్ల్లోకి ప్రవేశించేందుకు సాధారణంగా ఎవరికైనా 4 దారులుంటాయి. క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ టై-అప్స్, ప్రయార్టీ పాస్ లేదా డ్రీమ్‌ఫోక్స్ వంటి ఇంటర్నేషనల్ నెట్వర్క్స్, ఎంట్రీ ఫీజు నేరుగా చెల్లించడం (సాధారణంగా రూ.1,500-3,000 ఉంటుంది), గరిష్ఠ శ్రేణి తరగతుల్లో ప్రయాణించేందుకు కొన్న విమాన టిక్కెట్ల ద్వారా లాంజ్ల్లోకి వెళ్లవచ్చు. అయితే భారత్‌లో మొదటిదే ఎక్కువగా వాడుకలో ఉంటుంది. కస్టమర్లను ఆకర్షించడానికి బ్యాంకులే ఆ సదుపాయాల్ని కల్పిస్తాయి. అయితే ఇదేదో దయాగుణంతోనే, దాతృత్వంతోనో బ్యాంకులు చేయవు. లాంజ్ యాక్సెస్ అనేది ఓ శక్తివంతమైన మార్కెటింగ్ సాధనం.
దీనివల్ల కార్డుదారులు తమ కార్డులను తరచూ వినియోగిస్తూ ఉంటారు. దానివల్ల బ్యాంకులకు లావాదేవీ ఫీజుల రూపంలో ఆదాయం సమకూరుతుంది. కస్టమర్లు కూడా ప్రీమియం కార్డులకు అప్‌గ్రేడ్ కావాలని చూస్తూ ఉంటారు. దీంతో వ్యాపారం కూడా పెరుగుతుంది. ఇక అంతర్జాతీయ విమానాశ్రయాల్లో లాంజ్ సేవల విషయానికొస్తే.. లాంజ్కీ, ప్రయార్టీ పాస్ మరో రకంగా ఈ మొత్తం ప్రక్రియను చక్కబెడ్తాయి. వీటికి సొంతంగా లాంజ్లేమీ ఉండవు. అయినప్పటికీ మధ్యవర్తిత్వంగా వ్యవహరిస్తూ బ్యాంకులకు బల్క్‌గా లాంజ్ ప్రవేశ హక్కులను అమ్మేస్తాయి. లాంజ్ ఆపరేటర్లతో నేరుగా చెల్లింపు లావాదేవీలకు వీలు కల్పిస్తాయి.
గుర్తుంచుకోండి..
దేశీయ విమానాశ్రయాల్లో లాంజ్‌ల వినియోగం ఇటీవలికాలంలో విపరీతంగా పెరిగిపోతున్నది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి ప్రధాన రద్దీ విమానాశ్రయాల్లోనైతే ఇక చెప్పనే అక్కర్లేదు. దీంతో బ్యాంకులు సైతం ఆంక్షలు పెడుతున్నాయి. 3 నెలలకు 4సార్లు మాత్రమే ఉచిత ప్రవేశానికి అనుమతినిస్తున్నాయి. దేశీయ ఎయిర్‌పోర్టులకే పరిమితం చేస్తున్నాయి. సప్లిమెంటరీ కార్డుదారులకు మినహాయింపులనివ్వడం లేదు.
గెస్ట్ యాక్సెస్ ఉండట్లేదు. కార్డ్ యాక్టివ్‌గా ఉండకపోతే లాంజ్ వినియోగం రద్దు. అయితే హెచ్డీఎఫ్సీ ఇన్ఫినియా, యాక్సిస్ రిజర్వ్, అమెక్స్ ప్లాటినమ్, ఐసీఐసీఐ ఎమరాల్డ్ వంటి ప్రీమియం కార్డులు అపరిమితంగా లేదా అంతర్జాతీయ లాంజ్ ప్రవేశాలను కల్పిస్తున్నాయి. మొత్తానికి ఎయిర్పోర్ట్ రెస్టారెంట్లతో పోల్చితే ఆహారం, పానీయాలపై రూ.500-1,000దాకా ఎయిర్ ప్యాసింజర్లు ఆదా చేసుకోవచ్చు. పైగా ఉచిత వైఫై, ఏసీ, చార్జింగ్ స్టేషన్లు, శుభ్రమైన టాయిలెట్ల విలువ చెప్పలేనిదే.