సత్సంగం చేసి రమ్మని యువరాజును నది ఒడ్డున ఉన్న ఆశ్రమానికి పంపాడు రాజు. ఆశ్రమానికి వెళ్లిన యువరాజు సమీపంలో ఉన్న నదిని చూడగానే అందులో ఈత కొట్టడానికి సిద్ధమయ్యాడు. ప్రవాహం అధికంగా ఉండటంతో నదిలోకి దిగవద్దని గురువు వారించాడు. ‘ప్రవాహం ఈ యువరాజును ఏమి చేయగలదు?… నన్నే కట్టడి చేస్తారా!’ అని కినుక వహించాడు యువరాజు. ‘ప్రవాహం తగ్గాక స్నానం చేద్దువులే’ అని సముదాయించాడు గురువు.
ఇంతలో ఆకాశం మేఘావృతమైంది. ‘గాలివాన వస్తుందేమో! మన ఆశ్రమంలో రంగురంగుల గులాబీ తోట ఉంది, దానికి చక్కటి కంచె కూడా నిర్మించాం. మీరు వెళ్లి ‘ఈ తోటలోకి గాలివానకు ప్రవేశం లేదు’ అని గోడపై రాసి రండి’ అని యువరాజుతో అన్నాడు గురువు. యువరాజు నవ్వి ‘అలా రాస్తే తోటలోకి గాలివాన రాకుండా ఉంటుందా?’ అన్నాడు వెటకారంగా. ‘మంచి మాటన్నావు యువరాజా! నదీ ప్రవాహానికి మాత్రం ఈతకొట్టే మనిషి ఎవరో ఎలా తెలుస్తుంది? పేద-ధనిక, కులం-మతం, దేశం-ఖండం, మగ-ఆడ.. ప్రకృతి ఇలాంటివేం చూడదు. తన పని తాను చేసుకుపోతుంది. అది మనకు అనుకూలమైనది కావచ్చు, ప్రతికూలమైనదైనా కావచ్చు. ఒడ్డు అందంగా ఉన్నా, లేకున్నా సముద్ర కెరటాలు వచ్చి పోతూ ఉంటాయి కదా. మనకు అనుకూలమైనప్పుడు ఆకాశంలో విహరించడం, ప్రతికూలమైనప్పుడు పాతాళానికి దిగజారడం మంచిది కాదు. ఎవ్వరూ దేనికీ అతీతులు కారు. ‘నాకు అది వర్తించదు, ఇది వర్తించదు’ అంటే కుదరదు. ఎందుకంటే ప్రకృతి ముందు అందరూ సమానులే! ‘నిజమే! తోటలోకి రావద్దని రాసినా… గాలివాన వస్తే ఆగదు. నేను యువరాజునే అయినా.. నీటి వేగానికి కొట్టుకుపోతాను’ అని తెలుసుకుని ఆశ్రమంలో జరుగుతున్న భజనలో పాల్గొనడానికి అడుగులు వేశాడు యువరాజు.