ఖమ్మం సిటీ, మార్చి 21: ఖమ్మం జిల్లా టీబీ (క్షయ) నివారణ విభాగానికి జాతీయస్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించింది. వ్యాధి నిర్ధారణ చేయడం, రోగులకు నేరుగా మందులు అందించడం.. తద్వారా నివారణకు అమలు జరుపుతున్న కార్యక్రమాలకు గాను కాంస్య (బ్రాంజ్ మెడల్) పతకం లభించింది. ఈ మేరకు సోమవారం సాయంత్రం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పంపిన ఉత్తర్వులను జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ వరికూటి సుబ్బారావు అందుకున్నారు. దేశంలోని 206 జిల్లాలను ఎంపిక చేసుకుని టీబీ నివారణ అంశాలపై సర్వే నిర్వహించారు. వ్యాధి తగ్గుదల విషయమై 20-40 శాతం వరకు కాంస్యం, 40-60 శాతం వరకు రజతం, 60-80 శాతం వరకు స్వర్ణ పతకాలను ప్రకటించారు. దీనిలో భాగంగా ఖమ్మానికి కాంస్య పతకంతో అరుదైన గౌరవం దక్కింది. ఈ సందర్భంగా టీబీ విభాగపు అధికారి డాక్టర్ సుబ్బారావు మాట్లాడుతూ.. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశాలు, సలహాలు, సూచనలతో క్షయ వ్యాధిని అదుపులో ఉంచేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నామన్నారు. జాతీయ స్థాయి పతకం లభించడం తమలో స్ఫూర్తిని నింపిందని, బాధ్యతను మరింత పెంచిందని పేర్కొన్నారు.
జిల్లాలో కొంత కాలంగా టీబీ నివారణ కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి. ఖమ్మం జిల్లా టీబీ నివారణ అధికారి డాక్టర్ వరికూటి సుబ్బారావు సారథ్యంలో ‘టీబీ క్లబ్స్’ను ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ.. స్థానిక ప్రజాప్రతినిధులు, ఆశాలు, కమిటీ సభ్యుల సహకారంతో వినూత్న కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. వ్యాధి లక్షణాలు కలిగిన వారిని గుర్తించడం, అక్కడికక్కడే పరీక్షలు నిర్వహించడం, ఆర్నెల్లపాటు క్రమం తప్పకుండా మందులు వాడించడం, తద్వారా వ్యాధిని పూర్తిగా నయం చేయడం వంటివి చర్యలు తీసుకుంటున్నారు. వందశాతం తగ్గిన వారికి టీబీ చాంపియన్స్‌గా నామకరణం చేయడం, మిగతా రోగులకు వారితో సందేశాలు ఇప్పించడం వంటివి చేస్తున్నారు. కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత ప్రచారం చేస్తూ వ్యాధి పట్ల అవగాహన కల్పిస్తున్నారు. ఆ క్రమంలోనే ప్రైవేట్ ఆసుపత్రుల సహకారంతో శాంపిల్స్‌ను సేకరిస్తున్నారు. వాటిని జిల్లా కేంద్ర ప్రభుత్వ ప్రధాన వైద్యశాల ఆవరణలోని టీబీ విభాగానికి తరలించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆయా కార్యక్రమాలన్నింటినీ పరిగణనలోని తీసుకున్న నీతి అయోగ్.. ఖమ్మం జిల్లా టీబీ విభాగాన్ని ప్రత్యేకంగా ప్రశంసించింది. 2020-2021 సంవత్సరంలో దేశవ్యాప్తంగా క్షయ నివారణ కార్యాచరణకు ఖమ్మాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంచుకోవడం గమనార్హం.