ఖైరతాబాద్, జనవరి 22: ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 13న జాతీయ స్థాయిలో స్కాలర్షిప్ టెస్ట్‌ను నిర్వహిస్తున్నట్లు అకాడమీ చైర్మన్ కృష్ణ ప్రదీప్ తెలిపారు. శనివారం టెస్ట్‌కు సంబంధించిన బ్రోచర్లను ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌తో కలిసి ఆయన ఆవిష్కరించారు. అనంతరం, ఆయన విలేకరులతో మాట్లాడుతూ సివిల్ సర్వీసెస్‌లో అత్యున్నత కోచింగ్ ఇస్తున్న తమ సంస్థ పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన అభ్యర్థులకు రాయితీతో కూడిన శిక్షణ ఇచ్చేందుకు స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహిస్తున్నామన్నారు. పదో తరగతి, ఇంటర్ విద్యార్థులు ఈ పరీక్షల్లో పాల్గొనవచ్చునని, జీకే, ఇంగ్లిష్, మెంటల్ ఎబిలిటీ, కరెంట్ అఫైర్స్‌పై ఆంగ్ల మాధ్యమంలో ఆన్లైన్లో పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 9వ తేదీలోపు తమ దరఖాస్తులను పంపించాలని, 13న పరీక్షలు నిర్వహించి 15న ఫలితాలు విడుదల చేస్తామని, 20న టాప్ 100 మంది విద్యార్థులను ఎంపిక చేసి తమ సంస్థలో స్కాలర్‌షిప్‌తో కూడిన శిక్షణ ఇస్తామన్నారు. మరిన్ని వివరాలకు ఫోన్ నంబర్లు 91334 37733, 91335 37733లలో సంప్రదించాలన్నారు.