హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : నేషనల్ సెంట్రల్ యూనివర్సిటీల్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ పీజీ నోటిఫికేషన్ విడుదలయ్యింది. 2026-27 విద్యాసంవత్సరానికి పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2026 మార్చిలో ఈ పరీక్షలు నిర్వహిస్తారు. ఆన్లైన్ విధానంలో 90 నిమిషాలు/గంటన్నరపాటు నిర్వహిస్తారు. దరఖాస్తుల స్వీకరణ ఇప్పటికే ప్రారంభమయ్యింది. అభ్యర్థులు 2026 జనవరి 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెంట్రల్ యూనివర్సిటీలు, కేంద్రప్రభుత్వ విద్యాసంస్థలు, డీమ్డ్ వర్సిటీలు, ప్రైవేట్ విద్యాసంస్థల్లోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. రోజుకు మూడు సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. దేశవ్యాప్తంగా 292 ప్రధాన నగరాల్లో పరీక్ష సెంటర్లు ఏర్పాటు చేశారు. దేశం వెలుపల గల 16 నగరాల్లోను పరీక్షలు జరుగుతాయి. మొత్తం 157 సబ్జెక్టుల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. సరైన సమాధానానికి నాలుగు మార్కులు ఇవ్వనుండగా, తప్పుడు సమాధానానికి ఒక మార్కు కోత పెడతారు.