న్యూఢిల్లీ: ప్రభుత్వ పటిష్ట నియంత్రణలోని పౌర అణు రంగంలోకి ప్రైవేట్ రంగ ప్రవేశానికి తలుపులు బార్లా తెరిచేందుకు అవకాశం కల్పించడంతో సహా మూడు బిల్లులను కేంద్ర ప్రభుత్వం సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టింది. దేశంలోని యూనివర్సిటీలు, ఇతర ఉన్నత విద్యా సంస్థలు స్వతంత్రంగా, స్వయం పాలనగా మారేందుకు ఉద్దేశించిన వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్లును కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సభలో ప్రవేశపెట్టారు. పౌర అణు విద్యుత్తు రంగంలోకి ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ఆహ్వానించేందుకు ఉద్దేశించిన సస్టేనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా(శాంతి) బిల్లును పీఎంవోలో సహాయమంత్రి జితేంద్ర సింగ్ ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ద్వారా అటామిక్ ఎనర్జీ యాక్ట్, 1962, సివల్ లైబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్, 2010ని రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కాగా, ఈ చట్టాలను రద్దు చేసే బిల్లును న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్సభలో ప్రవేశపెట్టారు. బిల్లు ప్రతులు ఆలస్యంగా పంపిణీ చేయడం వల్ల బిల్లును అధ్యయనం చేసేంత సమయం లభించలేదని విపక్ష ఎంపీలు మనీశ్ తివారీ, సౌగతా రాయ్, జోతిమణి అభ్యంతరం తెలిపారు.