హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): పాఠశాల విద్యార్థుల్లోని అభ్యసనా సామర్థ్యాలు, ప్రతిభను పరీక్షించేందుకు శుక్రవారం నిర్వహించే నేషనల్ అచీవ్మెంట్ సర్వేకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే సర్వే నిర్వహించారు. ఈ ఏడాది ప్రైవేట్ స్కూళ్లతోపాటు కేంద్ర ప్రభుత్వ పాఠశాలల్లోనూ 3, 5, 8, 10 తరగతుల విద్యార్థులకు శాంపిల్ పరీక్షలను నిర్వహించనున్నారు. తెలంగాణలో 4,936 పాఠశాలల్లో 1,61,709 విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు.
పరీక్షల నిర్వహణకు 33 జిల్లాలకు కోఆర్డినేటర్లను, 8,544 మంది ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లను ఇప్పటికే నియమించారు. ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లుగా డైట్ లెక్చరర్లు, బీఈడీ, ఎంఈడీ కాలేజీల అధ్యాపకులు, బీఈడీ, డీఈడీ ట్రెయినీ విద్యార్థులను నియమించారు. గతంలో 2014లో ఈ సర్వేను నిర్వహించగా.. ఏడేండ్ల తర్వాత ఈ ఏడాదే సర్వేను నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ఎన్సీఈఆర్టీ) ఈ సర్వే చేపడుతున్నది. ఈ ఏడాది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ)కు సర్వే బాధ్యతలు అప్పగించారు.