న్యూఢిల్లీ: పశ్చిమాసియా సంక్షోభం యావత్ ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. అమెరికా-ఇజ్రాయెల్ దళాలు ఇరాన్‌పై చేస్తున్న దాడి ఆర్థిక సమస్యలు సృష్టిస్తున్నది. అయితే ప్రపంచ గమనాన్ని మార్చుతున్న ఇరాన్ యుద్ధాన్ని ఆపే శక్తి మోదీ, పుతిన్, జిన్పింగ్లకు మాత్రమే ఉన్నట్లు అమెరికా ఆర్థికవేత్త, ప్రొఫెసర్ జెఫ్రీ సాచ్స్(Jeffrey Sachs) తెలిపారు. ప్రపంచ విధ్వంసాన్ని వీళ్లు మాత్రమే అడ్డుకోగలరని ఆ ప్రొఫెసర్ చెప్పారు. న్యూఆర్డర్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఆ ముగ్గురు నేతలకు మంచి గుర్తింపు ఉన్నదని, వాళ్లు ఎంతో పరిణితి చెందిన వ్యక్తులు అని, అయితే ప్రస్తుత సంక్షోభాన్ని మోదీ, పుతిన్, జిన్‌పింగ్ అడ్డుకోగలరన్నారు. అమెరికా దూకుడును ఈ ముగ్గురు నేతలు ఆపగలరని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇరాన్ యుద్ధం ఆగాలని, గొప్ప వ్యక్తులే దీన్ని ఆపగలరని, ప్రస్తుతం ప్రపచంలో ముగ్గురు వ్యక్తులకు మాత్రమే ఆ సామర్థ్యం ఉందని, ఆ ముగ్గురు కలిసి ఈ విపత్తును నివారించాలన్నారు. భారత ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ కీలకమైన వ్యక్తులు అని, మూడు సూపర్‌పవర్ దేశాలకు చెందిన నేతలని, ప్రపంచాన్ని వినాశనం నుంచి అడ్డుకోగలరని, బ్రిక్స్ లాంటి వేదిక ద్వారా ఈ యుద్ధాన్ని నిలువరించగలరని ఆయన అభిప్రాయపడ్డారు.
భౌగోళికంగా, నాగరికత అంశంలోనూ భారత్‌కు అపార అనుభవం ఉందని, ఇలాంటి సమయంలో భారత్ నిష్క్రియాపరత్వాన్ని ప్రదర్శించరాదు అని, అమెరికా భ్రమలను కాదనే శక్తి, సామర్థ్యం, హోదా, గౌరవం అన్నీ భారత్‌కు ఉన్నట్లు జెఫ్రీ సాచ్చ్ తెలిపారు. పశ్చిమాసియా సంక్షోభాన్ని నివారించేందుకు చైనా, రష్యాతో కలిసి భారత్ సంయుక్త నిర్ణయం తీసుకోవాలన్నారు. దృఢమైన దౌత్య విధానాన్ని భారత్ అవలంబించాలని, ప్రాంతీయంగా తమకు ఉన్న పరిచయాలను ఇండియా వాడుకోవాలని, ఇరాన్‌తో ఆ దేశానికి సుదీర్ఘమైన సంబంధం ఉందని, బహుళ విధానాన్ని ఆచరించాలని, బ్రిక్స్ కూటమి దేశాలు అమెరికాను వ్యూహాత్మకంగా అడ్డుకునే వీలు ఉన్నట్లు సాచ్స్ తెలిపారు.
కొందరి ఇష్టానుసారం యుద్ధం జరుగుతోందని, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తున్నారని, దీంతో ప్రపంచవ్యాప్తంగా మానవ, ఆర్థిక విపత్తు సంభవిస్తుందని ఆయన వెల్లడించారు. ఇరాన్ వార్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఇంధన ధరలు పెరుగుతున్నాయి, అయితే ఈ దశలో చర్యలు తీసుకోకుంటే ప్రపంచం తీవ్ర సంక్షోభంలోకి వెళ్తుందని, ఇది ఒక దేశం పొరపాటు కాదు అని, ప్రపంచ సంక్షోభానికి దారి తీస్తున్నదని సాచ్స్ పేర్కొన్నారు. ఇరాన్‌పై పూర్తి స్థాయిలో దాడి చేస్తే అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇంధన శక్తి వ్యవస్థ దెబ్బతింటుందన్నారు.