Chandrababu | విశాఖలో ఈ నెల 14, 15న పెట్టుబడుల సదస్సు జరగనుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రజలకు అధునాతన అవసరాలతో పాటు కొత్త సాంకేతిక అంశాలపై అధ్యయనం చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామస్థాయి వీఆర్వోల వరకు ఉద్యోగులు బాధ్యతగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అమరావతిలో మీడియాతో సీఎం చంద్రబాబు నాయుడు చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెట్టుబడుల సాధనకు మంత్రి నారా లోకేశ్ తీవ్ర కృషి చేస్తున్నారని తెలిపారు. అవినీతి నిర్మూలనకు సమగ్ర చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం నిర్వాకం వల్లే రెవెన్యూ సమస్యలు వచ్చాయని తెలిపారు. పెండింగ్ సమస్యల పరిష్కారానికి ఆదేశించానని చెప్పారు. 22ఏ నిషేధిత భూములపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఎమ్మెల్యేలు విధిగా ప్రజా దర్బార్ నిర్వహించాల్సిందేనని స్పష్టం చేశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని చంద్రబాబు నాయుడు తెలిపారు. తమన్, ఇళయరాజా మ్యూజికల్ నైట్స్, విజయవాడ ఉత్సవ్ ప్రత్యేక గుర్తింపు తెస్తున్నాయని అన్నారు. భారీ ఈవెంట్లు, పెట్టుబడులతో ఏపీ దూసుకెళ్తుందని చెప్పారు. నాయుడుపేటలో ప్రీమియర్ ఎనర్జీస్ పెట్టుబడులు శుభపరిణామమని వ్యాఖ్యానించారు.