– బోనకల్లులో మూడేళ్లుగా ఖాళీగా ఉన్నా ఎటూ తేల్చిన అధికారులు
– చేతులెత్తేసిన సెలెక్ట్ కమిటీ మెంబర్లు
– కుక్కింగ్ హెల్పర్లకే అటెండర్ బాధ్యతలు
బోనకల్లు, నవంబర్ 8 : బోనకల్లు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో 2022 మార్చి నుండి అటెండర్ పోస్టు ఖాళీగా ఉంది. అప్పటి నుండి అటెండర్లుగా అక్కడి కుకింగ్ హెల్పర్లే వ్యవహరిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ విద్యాలయంలో 6వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు 291 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. విద్యార్థులు, బోధన సిబ్బంది పడుతున్న ఇబ్బందులను కస్తూర్బా గాంధీ విద్యాలయం స్పెషలాఫీసర్ ఎంఈఓ దృష్టికి తీసుకువెళ్లారు. సమస్యను ఆయన జిల్లా విద్యాశాఖ అధికారికి నివేదించారు. స్పందించిన జిల్లా అధికారులు వెంటనే అటెండర్ పోస్టు భర్తీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఎంఈఓ దామాల పుల్లయ్య గడిచిన జూలై 14న అటెండర్ పోస్టు భర్తీకి కాంట్రాక్ట్ పద్ధతిలో నోటిఫికేషన్ జారీ చేశారు. 45 సంవత్సరాల లోపు మహిళలకు అవకాశం కల్పిస్తూ దరఖాస్తులు స్వీకరించారు. పదో తరగతి అర్హత, ఎటువంటి రిజర్వేషన్ లేకుండా అటెండర్ పోస్ట్ భర్తీ చేయాల్సి ఉంది.
అయితే అటెండర్ పోస్ట్ కోసం టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ, బీఈడీ పూర్తి చేసిన 118 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరులు 73 మంది బోనకల్లు మండలానికి చెందిన స్థానికులు ఉన్నారు. దరఖాస్తులు ముగిసిన వెంటనే మండల సెలక్షన్ కమిటీ తాసీల్దార్, ఎంపీడీఓ, ఎంఈఓ పదో తరగతి అర్హత ఆధారంగా అటెండర్ పోస్టును భర్తీ చేయాల్సి ఉంది. అసలు విషయం ఇక్కడి నుంచి మొదలైంది. ఎంపిక విషయంలో నిబంధనల ప్రకారం అధికారులను చేయనివ్వకుండా కాంగ్రెస్ నాయకులు పదేపదే అడ్డుపడుతూ ఇబ్బందులు గురిచేసిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
తాము సూచించిన వారికే అటెండర్ పోస్టు ఇవ్వాలని కాంగ్రెస్ నాయకులు ఒత్తిళ్లకు గురి చేశారు. దీంతో అధికారులు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో తలలు పట్టుకుంటున్నారు. ఎంపిక ప్రక్రియ చేపట్టకుండా చేతులెత్తేశారు. ఈ విషయమై డీఈఓ మండల అధికారులను మందలించినట్లుగా సమాచారం. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు నిబంధనల ప్రకారం అర్హురాలిని గుర్తించి అటెండర్ పోస్ట్ భర్తీ చేస్తారా లేదా ఏదో ఒక రిజర్వేషన్ కల్పించి పోస్ట్ ను భర్తీ చేస్తారా అన్న సందేహాలు దరఖాసుదారుల్లో వ్యక్తమవుతున్నాయి.