నా చిన్నప్పటి ముచ్చట… అప్పుడప్పుడే సినారె గురించి బడిలో వింటున్న కాలం. అందులోనూ వారు చదివిన బడిలో, అదే తరగతిలో నేనూ చదువుకుంటున్నానని, మా ఇంటికి నూరు గజాల దూరంలోని ఇంట్లో వారు ఉండేవారని తెలిసి ఖుషీ అయ్యేవాణ్ని. ఈ సమయంలోనే ప్రతిరోజూ మోగుతూ ఉండే మా ఇంట్లోని ‘మార్కోని’లో సినారె సినిమా గీతాలు వచ్చేవి. అందులోనూ ‘నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని’
పాటైతే మరీనూ!
ఇవ్వాళ్టికీ సినారె సినీ గీతమన్న మాట వినగానే కోటానుకోట్ల తెలుగుల గుండెల్లోనూ ఝమ్మంటూ వినిపించేది కూడా ఈ పాటే! ఆయనకు అంతగా ఖ్యాతిని తెచ్చిన గీతమిది. ‘గులేబకావళి కథ’ సినిమా కోసం మొదట రికార్డు చేసింది ఈ పాటనే. అలా ‘నన్ను దోచుకుందువటే..’ సినారె తొలి సినీగీతమై నేటికీ యిగిరిపోని గంధంలా పరిమళాలు వెదజల్లుతూనే ఉన్నది.
ఇది యుగళ గీతం. నాయికా నాయకులైన నందమూరి తారకరామారావు జమునలపై దీనిని చిత్రీకరించారు. ఘంటసాల, పి.సుశీల ఆలపించారు. జోసఫ్-కృష్ణమూర్తి ద్వయం సంగీతం అందించింది. సోలో గీతాల కన్నా యుగళ గీతాల్లో కనిపించే సోయగం గొప్పగా ఉంటుంది. అందులోనూ కొంటెగా ప్రశ్నిస్తున్న నాయకునికి, అంతకు మించిన వగలతో వయ్యారంగా సమాధానం చెప్పే నాయిక సీన్లో ఉంటే అది మరింత అందంగా అమరుతుంది. ఇక.. ఆ జోడీ ఎన్టీయార్, జమున అయితే.. మీరే ఊహించుకోండి!
అతను: నన్ను దోచుకుందువటే
నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని
ఆమె: కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి,
నిన్నే నా స్వామి
అతను: నన్ను దోచుకుందువటే….
‘కలల అలలపై’ పాట గురించి మాట్లాడుకున్నట్టు.. ఇది కూడా ప్రశ్నోత్తరాలుగా సాగే గీతం. ఇందులోని పల్లవి రెండు భాగాలుగా నడుస్తుంది. నాయకుడు ‘ఓ వన్నెల దొరసానీ.. నన్ను దోచుకుంటావా?’ అని ప్రశ్నిస్తే, నాయిక అంతే ఆరాధనగా ‘నా కన్నుల్లో దాచుకుంటాను’ అని సమాధానం చెబుతుంది. వారిద్దరిలో వికసిస్తున్న ప్రణయభావనకు ఈ పాటల మాటలు ఊటలుగా కనిపిస్తాయి. ఆకర్షించడం, ఆకట్టుకోవడం అన్నవాటికి ఎంతో భిన్నంగా ‘దోచుకోవడం’ అనేది అప్పటికి కొత్త పలుకుబడే. ఇంకా వన్నెల ‘దొరసాని’ ప్రయోగం కూడా అప్పటికి కొత్తదనే చెప్పాలి.
సినారెకు కర్పూర శబ్దమంటే మిక్కిలి మక్కువ. హనుమాజీపేటలోని సినారె కర్మభూమి పేరు కూడా కవితా ‘కర్పూర’ క్షేత్రమే మరి. ఆయన అన్నట్టు ‘ఈ యుగళ గీతంలో భావపారవశ్యంతో పాటు గాన మాధుర్యం ప్రధాన గుణం’ కాబట్టే ఇది అంత హిట్టయ్యింది. సినిమాకు ఆయువు
పట్టయ్యింది. ముఖ్యంగా ఈ యుగళగీతంలోని ధ్వని ప్రధానమైన అలంకారిక లక్షణం ప్రాణవాయువుగా నిలిచింది కూడా!
ఆమె: తరియింతును నీ చల్లని
చరణమ్ముల నీడలోన ॥2॥
పూలదండవోలే.. కర్పూరకళిక వోలే,
కర్పూర కళికవోలే
అతను: ఎంతటి నెరజాణవో..
నా అంతరంగమందు నీవు ॥2॥
కలకాలం వీడని సంకెలలు వేసినావు/
సంకెలలు వేసినావు
॥ నన్ను దోచుకుందువటే॥
చరణాల్లోని పూలదండ సువాసనకు, కర్పూరకళికను పారవశ్యానికి సంకేతంగా చెప్పుకోవచ్చు. ఈ చరణాల చివరలోని ‘కర్పూర కళికవోలె, సంకెలలు వేసినావు’ అన్నవి పునరుక్తి కావడం గీతానికి అందాన్ని కూర్చాయి. ఇందులోని ప్రతి పదంలో, చరణంలో నాయికా నాయకుల కొంటెతనం ఎంతగా కనిపిస్తాయో అంతే వాచ్యంగా వారిద్దరూ వ్యక్తపరుచుకుంటున్న ప్రేమ విశేషాలు వినిపిస్తాయి. అంతేకాదు నాయిక ‘నీ పాదాల వద్ద తరిస్తాన’ని అంటే నాయకుడు తుంటరి సమాధానంగా ‘ఎన్నటికీ వీడని సంకెళ్లు వేశావు’ అంటాడు. ఈ సమాధానం ఆమె పట్ల అతనికి ఉన్న ప్రేమను చాటుతుంది. ఈ గీతాన్ని కూర్చిన ‘భీంప్లాస్’ రాగశైలి దీనికి మరింత వన్నెతెచ్చింది.
ఆమె: నా మదియే మందిరమైనీవే ఒక దేవతమై ॥2॥
వెలసినావు నాలో నే కలిసిపోదు నీలో/
కలిసిపోదు నీలో..
అతను: ఏనాటిదో మనబంధం
ఎరుగరాని అనుబంధం ॥2॥
ఎన్ని యుగాలైనా ఇది యిగిరిపోని గంధం
యిగిరిపోని గంధం
చివరి చరణంలోని ‘బంధం’, ‘అనుబంధం’, ‘గంధం’ లాంటి పదాల్లో కవి ప్రయోగించిన అనుప్రాసలు, ‘పూలదండవోలె’, ‘కర్పూరకళికవోలె’ వంటి ఉపమలు అందాన్ని కూర్చగా ‘వోలె’ లాంటి ఉపమా వాచకాల ప్రయోగం నిరంతర ప్రయోగశీలి అయిన సినారెకు తెలిసిన రసవిద్య… లయాత్మకతకు భూమిక.
– పత్తిపాక మోహన్