వరంగల్ చౌరస్తా, ఫిబ్రవరి 01 : చావు నోట్లో తలపేట్టి తెలంగాణ సాధించి, దేశానికి ఆదర్శంగా తెలంగాణను తీర్చిదిద్దిన కేసీఆర్ ని టచ్ చేస్తే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరని వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఆదివారం వరంగల్ చౌరస్తాలో బీఆర్ఎస్ పిలుపు మేరకు నిరసన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోలీసులను అడ్డు పెట్టుకొని కక్ష పూరిత రాజకీయాలు చేస్తున్నదని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ పేరుతో హరీష్ రావు, కేటీఆర్ లను విచారించిన సిట్ కు వారిచ్చిన సమాధానాలు, ఎదురుప్రశ్నలతో కండ్లు బయ్యర్లు కమ్మాయని అన్నారు. ఇక కేసీఆర్ తో పెట్టుకుంటే పరిస్థితి ఎట్లుంటుందో వారి ఊహకే వదిలేస్తున్నానని అన్నారు. ఇచ్చిన ఆరు గ్యారంటీలను, 420 హామీలను అమలు చేయకుండా ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్నదని అన్నారు. కాంగ్రెస్ హామీలకు ప్రజాప్రతినిధులు, అధికారులు బాధ్యత వహించాల్సిందేనని అన్నారు.
ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ప్రజల దృష్టిని మరల్చే పని చేస్తున్నదని అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు BRS వైపునే ఉన్నారని స్పష్టంగా తెలిసిపోవడంతో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్న రేవంత్ రెడ్డికి ప్రజలు గట్టి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో 70 శాతానికి మించి సీట్లు గెలుచుకోవడం ఖాయమని అన్నారు. కేసీఆర్ ను ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం రాష్ట్రం అగ్నిగోళంగా మారుతుందని, అందుకు పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డిదేనని అన్నారు. అనంతరం వరంగల్ చౌరస్తా నుండి స్టేషన్ రోడ్ వైపుకు వెళ్లే మార్గానికి అడ్డుగా కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్న నరేందర్ ని పోలీసులు అరెస్ట్ చేసి ఇంతేజార్గంజ్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కుమారస్వామి, మాజీ కార్పొరేట్ కుందారపు రాజేందర్, బజ్జూరి వాసు, పలువురు డివిజన్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.