నాని తాజా పాన్ ఇండియా చిత్రం ‘ది ప్యారడైజ్’ ఆగస్ట్ 21న ప్రేక్షకుల ముందుకురానున్న విషయం తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని భాగాలను రీషూట్ చేస్తున్నారని, దాంతో షూటింగ్ ఆలస్యం కానుందని సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతున్నది. వీటిని చిత్రబృందం ఖండించింది.
ఈ మేరకు మంగళవారం ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఓ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఒక్క సన్నివేశాన్ని కూడా రీషూట్ చేయలేదని, షూటింగ్ అనుకున్న షెడ్యూల్ ప్రకారం జరుగుతున్నదని, సృజనాత్మకంగా…సాంకేతికంగా అన్ని విభాగాల్లో ఈ సినిమా అద్భుతంగా రూపొందుతున్నదని ఆ ప్రకటనలో మేకర్స్ వివరణ ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 21న భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నామని తెలిపారు. సికింద్రాబాద్ నేపథ్యంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ‘జడల్’ పాత్రలో నాని కనిపించనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై భారీ హైప్‌ని క్రియేట్ చేశాయి.