‘వచ్చీ రాని భాష ఒంటికి మోసం’ అంటారు కదా. అదే మాటని నిజం చేస్తున్నాయి ఏఐ సలహాలు! ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వాడకం మితిమీరిపోతున్నది. తెలియని శాస్ర్తాల గురించి, తెలుసుకోవాల్సిన విషయాల గురించి ఏఐ చాట్‌బాట్‌ని అడిగితే బాగానే ఉంటుంది. కానీ, తెలిసిన మనిషితో మాట్లాడటానికీ ఏఐని సాయం కోరుతున్నారట. ఇదేదో సాధారణ సంభాషణ అయితే మాట చెల్లుబాటవుతుంది. గర్ల్‌ఫ్రెండ్‌తో, బాయ్‌ఫ్రెండ్‌తో అయితే ఎట్లా? మాటలకు అర్థాలే కాదు, భావోద్వేగాలూ ఉంటాయని జెన్‌జీకి అర్థం కావట్లేదు. సందర్భాన్ని బట్టి ‘కొన్ని మాటలు చెప్పు’ అని ఏఐని అడగడం, అవే మాటలతో సెక్స్టింగ్ చేస్తున్నారట. ఈ మాటలు కొన్ని జంటల మధ్య కొద్దికాలం అంతరం పెరగడానికి కారణమవుతున్నాయట. పాశ్చాత్య దేశాల్లో డేటింగ్లో ఉన్న జంటల మధ్య ఉన్నట్టుండి విభేదాలు రావడం, అలక పూనడానికి కారణాలను విశ్లేషిస్తే ఏఐ ముచ్చట బయటపడ్డది.
ప్రేమలోనో, డేటింగ్లోనో ఉన్నప్పుడు మాటలు వేరుగా ఉంటాయి. కానీ ఏఐ కూడా ఓ యంత్రమే కదా. దానికి హృదయంలోంచి వచ్చే భాష తెలియదు. ట్రైన్ చేసినా అవతలి వాళ్ల మెసేజ్‌లో ఉన్న గాఢత, లోతు, ఉద్వేగం అర్థం కావు. అప్పుడు ఏఐ సూచించే మాటలు.. ప్రేమికుల మధ్య మంటలు రేపుతున్నాయట. ‘ఏదో మాట సాయానికి వస్తే నన్ను తప్పు పడతారా?’ అని ఏఐ అనవచ్చు. ఏఐని అవసరమైన చోటే ఉపయోగించాలి. వ్యక్తిగత సంభాషణల్లో కాదు. కాబట్టి ప్రేమలో ఉంటే ఏఐకి పని చెప్పకుండా మనసుతో మాట్లాడాలని దెబ్బతిన్న అనుభవంతో సీనియర్లు చెబుతున్నారు. కొత్తగా ప్రేమలో ఉన్నవాళ్లు, డేటింగ్‌కి సిద్ధమైనవాళ్లు కాస్త ఈ జాగ్రత్తలు పాటిస్తే మంచిది.