Yash | కన్నడ స్టార్ హీరో యశ్ తల్లి పుష్ప చేసిన తాజా వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ‘కేజీఎఫ్’ సినిమాకు ముందు యశ్ ఎవరు? అంటూ ఇటీవల వినిపించిన వ్యాఖ్యలకు ఆమె పరోక్షంగా ఘాటైన సమాధానం ఇచ్చారు. తన కుమారుడి ఎదుగుదలను కొందరు ఓర్చుకోలేకపోతున్నారని, అందుకే అతడిని లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్నారని ఆమె వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఓ సందర్భంలో తన కుమారుడి గురించి మాట్లాడిన పుష్ప.. ‘‘నా కుమారుడు ఉగ్రవాది కాదు. అతడు అందరిలా ధనిక కుటుంబంలో పుట్టలేదు. ఒక బస్ డ్రైవర్ కొడుకుగా పుట్టి, తన సొంత కష్టంతో ఈ స్థాయికి ఎదిగాడు’’ అంటూ తన కుమారుడి ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు.
యశ్‌కు ‘కేజీఎఫ్’ సినిమాతోనే స్టార్డమ్ వచ్చిందనే ప్రచారంపై పుష్ప స్పందిస్తూ.. ఆ సినిమాకు ముందు కూడా తన కుమారుడు కన్నడ చిత్ర పరిశ్రమలో వరుస విజయాలు అందుకున్నాడని తెలిపారు. ‘కేజీఎఫ్’కు ముందు యశ్‌కు ఐదు హిట్లు వచ్చాయని, అప్పటికే ఆయనకు మంచి గుర్తింపు ఉందని పేర్కొన్నారు.‘మీరు చెప్పినట్లు యశ్‌కు ఎలాంటి గుర్తింపు లేకపోతే.. ఇప్పుడు అందరూ అతడిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?’అనే భావనను ఆమె వ్యక్తం చేసారు. ఒక తల్లిగా తన కుమారుడి ఎదుగుదలను చూసి ఎంతో గర్వపడుతున్నానని పుష్ప చెప్పారు. యశ్ సాధించిన పాన్-ఇండియా స్టార్డమ్ ఒక్కసారిగా వచ్చినది కాదని ఆయన తల్లి స్పష్టం చేశారు. కన్నడ సినీ పరిశ్రమలో ఎన్నో ఏళ్ల పాటు కష్టపడి, అనేక సవాళ్లను ఎదుర్కొన్న తర్వాతే ఈ స్థాయికి చేరుకున్నారని ఆమె అన్నారు.
ముఖ్యంగా సాధారణ కుటుంబం నుంచి వచ్చిన తన కుమారుడు తన ప్రతిభ, పట్టుదలతో ఈ స్థాయికి ఎదిగాడని పుష్ప గుర్తుచేశారు. అయితే తన వ్యాఖ్యల్లో ఆమె ఎవరి పేరును నేరుగా ప్రస్తావించలేదు. అయితే గతంలో ‘కేజీఎఫ్‌కు ముందు యశ్ ఎవరు?’ అంటూ అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు చర్చకు రావడంతో.. పుష్ప తాజా వ్యాఖ్యలు ఆయనను ఉద్దేశించే చేసినవేనని కొందరు నెటిజన్లు, సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అయితే దీనిపై పుష్ప మాత్రం ఎలాంటి వ్యక్తి పేరు వెల్లడించలేదు. ఇదిలా ఉంటే.. ఇటీవల ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యశ్ కూడా సినిమా విజయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక సినిమా సక్సెస్‌కు కేవలం హీరో మాత్రమే కారణం కాదని ఆయన స్పష్టం చేశారు.ఒక సినిమా వెనుక దర్శకుడు, రచయితలు, సాంకేతిక నిపుణులు, ఇతర నటీనటులు సహా ఎంతో మంది కష్టపడతారని యశ్ తెలిపారు. అందరి సమష్టి కృషితోనే సినిమా విజయం సాధిస్తుందని చెప్పారు. అదే సమయంలో సినిమాలో ప్రధాన పాత్ర పోషించే నటుడు తన పాత్రను సరిగ్గా చేయలేకపోతే మాత్రం ఆ సినిమా విజయం సాధించడం కష్టమని యశ్ అభిప్రాయపడ్డారు.