Irumudi Kattu | మాస్ మహారాజా రవితేజ హీరోగా, విభిన్నమైన ఫ్యామిలీ ఎమోషన్స్‌ను తెరపై ఆవిష్కరించడంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఇరుముడి’. అయ్యప్ప స్వామి భక్తి, తండ్రీకూతుళ్ల మధ్య ఉండే ఆత్మీయ అనుబంధాన్ని ప్రధానంగా తీసుకుని ఈ సినిమాను రూపొందించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం బాక్సీఫీస్ని షేక్ చేస్తుంది. ఈ సినిమాకి పోటీగా ఎన్ని సినిమాలు విడుదలైన ఇరుమడికి మాత్రం మంచి ఆదరణ దక్కుతుంది.
ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న కీలకమైన ‘ఇరుముడి కట్టు’ వీడియో సాంగ్‌ని మేకర్స్ ఘనంగా విడుదల చేశారు. ‘కట్టు కట్టు ఇరుముడి కట్టు’ అంటూ సాగే ఈ గీతం విడుదలైన వెంటనే యూట్యూబ్‌తో పాటు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ ఈ పాటకు అందించిన ట్యూన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హై-వోల్టేజ్ భక్తి సంగీతం, అయ్యప్ప మాలధారుల నృత్యాలు, ‘స్వామియే శరణమయ్యప్ప’ అనే నామస్మరణతో సాగుతున్న ఈ గీతం శ్రోతలను ఆకట్టుకుంటోంది.
పాటను వింటున్న సమయంలోనే భక్తిభావం కలిగేలా మ్యూజిక్‌ను కంపోజ్ చేసిన తీరు ప్రశంసలు అందుకుంటోంది. ముఖ్యంగా మాలధారుల డ్యాన్స్ మూమెంట్స్, ఎనర్జిటిక్ బీట్స్ పాటకు మరింత జోష్‌ను తీసుకొచ్చాయి. సోషల్ మీడియాలో ఈ పాటకు సంబంధించిన వీడియోలు, రీల్స్ వైరల్ అవుతున్నాయి. ‘ఇరుముడి’లో ఈ పాటతో పాటు ‘విల్లాలి వీరుడు’, ‘మల్లెపూల పల్లకి’ వంటి భక్తి గీతాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కథ విషయానికి వస్తే.. మద్యానికి బానిసైన ఓ మధ్యతరగతి తండ్రి తన వ్యసనం కారణంగా తన ప్రాణానికి ప్రాణమైన కూతురికి దూరమయ్యే పరిస్థితిని ఎదుర్కొంటాడు. తన తప్పును తెలుసుకున్న తర్వాత మద్యాన్ని పూర్తిగా వదిలేసి, కూతురి కోసం అయ్యప్ప దీక్షను స్వీకరించడానికి ఆయన తీసుకునే నిర్ణయం చుట్టూ కథ సాగుతుంది. చిత్రంలో హీరోయిన్గా ప్రియా భవానీ శంకర్ నటించగా, రవితేజ కూతురి పాత్రలో బేబీ నక్షత్ర కనిపించి అలరించింది.