Irumudi | మాస్ మహారాజా రవితేజకు మరో బ్లాక్‌బస్టర్ హిట్ దక్కింది. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ‘ఇరుముడి’ సినిమా బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి దూసుకెళ్తోంది. విడుదలైనప్పటి నుంచి ప్రేక్షకుల నుంచి వస్తున్న అద్భుతమైన స్పందనతో ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా ఇప్పటికే రూ.150 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటింది. ప్రస్తుతం అదే జోరును కొనసాగిస్తూ మరో భారీ మైలురాయిని అందుకునే దిశగా పరుగులు పెడుతోంది. ‘ఇరుముడి’ సినిమాకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్‌కు తాజా టికెట్ సేల్స్‌నే నిదర్శనంగా చెప్పొచ్చు. ప్రముఖ ఆన్లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫామ్స్ బుక్‌మైషో, డిస్ట్రిక్ట్ ద్వారా ఇప్పటివరకు ఈ సినిమా 70 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు సమాచారం.
ఒక ప్రాంతీయ సినిమా ఈ స్థాయిలో టికెట్లను విక్రయించడం అరుదైన విషయంగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా సినిమా విడుదలై రోజులు గడుస్తున్నా టికెట్ డిమాండ్ ఏమాత్రం తగ్గకపోవడం ‘ఇరుముడి’కి ఉన్న మౌత్ టాక్‌ను తెలియజేస్తోంది. రూ.150 కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకున్న ‘ఇరుముడి’ ఇప్పుడు రూ.200 కోట్ల వరల్డ్‌వైడ్ గ్రాస్ దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుత బాక్సాఫీస్ ట్రెండ్, థియేటర్లలో కొనసాగుతున్న ఆక్యుపెన్సీ, ఆన్లైన్ టికెట్ బుకింగ్స్‌ను పరిశీలిస్తే ఈ మైలురాయిని కూడా సినిమా చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.సాధారణంగా విడుదలైన మొదటి వారంతో పోలిస్తే రెండో వారంలో సినిమాల వసూళ్ల వేగం తగ్గుతుంది. అయితే ‘ఇరుముడి’ విషయంలో పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. వీకెండ్లో ప్రేక్షకుల స్పందన మరింత పెరగడం, ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు యువత కూడా థియేటర్లకు క్యూ కట్టడం సినిమాకు కలిసొస్తోంది.
రవితేజ మాస్ ఇమేజ్‌కు తగ్గ కమర్షియల్ అంశాలతో పాటు కథకు, భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇవ్వడం ‘ఇరుముడి’ విజయానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా చెబుతున్నారు. దర్శకుడు శివ నిర్వాణ తనదైన శైలిలో కథను తెరకెక్కించడంతో ప్రేక్షకులు సినిమాతో కనెక్ట్ అవుతున్నారని చిత్ర బృందం భావిస్తోంది. రవితేజ తన పాత్రలో మాస్ ఎనర్జీతో పాటు భావోద్వేగాలను కూడా బలంగా పండించారని అభిమానులు ప్రశంసిస్తున్నారు. సినిమాలోని కీలక సన్నివేశాలు ప్రేక్షకులను కదిలిస్తున్నాయని, ముఖ్యంగా క్లైమాక్స్ ఎమోషనల్ సీన్స్‌కు థియేటర్లలో మంచి స్పందన వస్తుంది. ‘ఇరుముడి’లో రవితేజతో పాటు బేబీ నక్షత్ర, ప్రియా భవానీ శంకర్, సాయికుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. తమ పాత్రలకు తగిన న్యాయం చేస్తూ నటీనటులు మెప్పించారు.