Suicide | ఆన్లైన్ గేమ్స్, క్యాసినో ఆటలు ఓ యువకుడి కుటుంబంలో విషాదాన్ని నింపాయి. ఆన్లైన్ జూదం ఆటల్లో భారీగా డబ్బు పోగొట్టుకుని అప్పుల పాలైన వేములవాడకు చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కరీంనగర్‌లోని కోతిరాంపూర్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
వేములవాడ పట్టణంలోని సుభాష్‌నగర్‌కు చెందిన నరాల కార్తీక్ (35) ఆన్లైన్ గేమ్స్, క్యాసినో, జూదం ఆటలకు అలవాటు పడ్డట్లు సమాచారం. ఈ క్రమంలో భారీగా డబ్బు పోగొట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఆటల కారణంగా దాదాపు రూ.కోటి వరకు అప్పులు చేసినట్లు సమాచారం. అప్పుల భారం, ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర మనస్తాపానికి గురైన కార్తీక్.. కరీంనగర్‌లోని కోతిరాంపూర్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.
కార్తీక్‌కు భార్య కల్పనతో పాటు కుమార్తె నందిత, కుమారుడు సిద్ధులు ఉన్నారు. కుటుంబాన్ని విషాదంలోకి నెట్టి కార్తీక్ బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.