కడప: మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో బడానేతల పేర్లను కారు డ్రైవర్ షేక్ దస్తగిరి కన్ఫెషన్ స్టేట్మెంట్లో వెల్లడించడం సంచలనం కలిగిస్తుంది. వివేకా హత్యపై దస్తగిరి ఆగస్ట్ 30న ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ను మిగతా నిందితుల లాయర్లకు కోర్టు ఇవ్వడంతో ఆ స్టేట్మెంట్లో నల్గురు బడా నేతల పేర్లు వెలుగులోకి వచ్చాయి . ఈ హత్యలో ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, గుజ్జుల ఉమాశంకర్‌రెడ్డితో కలిసి వివేకాను హత్య చేసినట్టు దస్తగిరి పేర్కొన్నాడు. బెంగూళూరులోని ల్యాండ్ కొనుగోలులో గంగిరెడ్డికి వాటా ఇవ్వకపోవడంతో పాటు , ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమికి కారణమంటూ గంగిరెడ్డిని ,అవినాష్, భాస్కరరెడ్డి, డి.శంకర్‌రెడ్డిలను వైఎస్ వివేకా బెదిరించారు.
దీంతో వైఎస్ వివేకాను హత్య చేయాలని గంగిరెడ్డి 40కోట్ల రూపాయలు సుపారీ ఇచ్చినట్లు దస్తగిరి తన స్టేట్మెంట్లో పేర్కొన్నాడు. తనకు రూ. 5 కోట్లు ఆఫర్ ఇచ్చి కోటి రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారని ఆయన వెల్లడించారు. హత్య సంఘటన రోజు ముందుగా సునీల్ యాదవ్, ఉమాశంకరరెడ్డి కలిసి వివేకా ఇంటి దగ్గర.. కుక్కను కారుతో తొక్కించి చంపేసినట్టు దస్తగిరి వెల్లడించారు. సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డిలతో కలిసి తాను వివేకా ఇంటి కాంపౌండ్ దూకి లోపలికి వెళ్లగా అప్పటికే ఇంట్లో ఉన్న ఎర్ర గంగిరెడ్డి తలుపు తీయడంతో లోపలికి వెళ్లామని దస్తగిరి కన్ఫెషన్ స్టేట్మెంట్లో వివరించాడు.
తమను చూసిన వివేకా ఈ సమయంలో వీళ్లెందుకు వచ్చారని నిర్ఘాంతపోయారని, తర్వాత వివేకా బెడ్రూమ్లోకి వెళ్లడంతో అతని వెనుకే గంగిరెడ్డి కూడా వెళ్లాడని వివరించాడు. వివేకా బెడ్రూమ్లో డబ్బు గురించి తీవ్ర వాగ్వాదం జరిగిందని, వివేకాను బూతులు తిడుతూ మొహంపై దాడి చేసి గొడ్డలితో దాడిచేశాడని, వెంటనే వివేకా కింద పడిపోవడంతో అతని ఛాతిపై 7, 8 సార్లు సునీల్ యాదవ్ బలంగా కొట్టినట్టు దస్తగిరి వెల్లడించారు.