భారత యువ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేసి అదరగొడుతున్నాడు. జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నాడు. టోర్నీ ఏదైనా టైటిల్ పక్కా అన్న రీతిలో దూసుకెళుతు ప్రత్యర్థులకు దీటైన సవాల్ విసురుతున్నాడు. జాతీయ చెస్ చాంపియన్‌షిప్‌తో పాటు తాజాగా ముగిసిన ఢిల్లీ ఇంటర్నేషనల్ టోర్నీలో విజేతగా నిలిచిన ఈ వరంగల్ కుర్రాడు చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ వారసునిగా నిరూపించుకుంటున్నాడు. టోర్నీ టోర్నీకి ఎలో రేటింగ్‌ను మెరుగుపర్చుకుంటున్న అర్జున్..2700 లక్ష్యంగా ముందుకెళుతున్నాడు. ఒక నెలలో రెండు టైటిళ్లను తన ఖాతాలో వేసుకున్న అర్జున్ ఆన్లైన్ చాంపియన్‌షిప్‌లో సత్తాచాటేందుకు తహతహలాడుతున్నాడు. ఈ నేపథ్యంలో ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలు పంచుకున్నాడు.
వరుస టోర్నీల్లో విజయాలపై మీ స్పందన?
కాన్పూర్‌లో జరిగిన జాతీయ సీనియర్ చెస్ చాంపియన్‌షిప్‌తో పాటు తాజాగా ముగిసిన ఢిల్లీ ఇంటర్నేషనల్ టోర్నీలో విజేతగా నిలువడం చాలా సంతోషంగా ఉంది. ఒకే నెలలో రెండు టైటిళ్లను ఖాతాలో వేసుకోవడం మరిచిపోలేని అనుభూతి. ఈ రెండు టోర్నీల్లోనూ ప్రత్యర్థుల నుంచి దీటైన పోటీ ఎదురైంది. ముఖ్యంగా తమిళనాడుకు చెందిన గుకేశ్‌తో పాటు మన తెలంగాణ యువ గ్రాండ్‌మాస్టర్ హర్ష భరత్కోటితో నాకు ఢీ అంటే ఢీ అన్నట్లు గేమ్‌లు జరిగాయి. పాయింట్ల పరంగా ముగ్గురం(8.5) సమంగా నిలిచినప్పటికీ విజేతను నిర్ణయించేందుకు జరిగిన టై బ్రేక్‌లో విజయం నన్ను వరించింది.
మీ తదుపరి లక్ష్యం?
కాన్పూర్, ఢిల్లీ చెస్ టోర్నీల ద్వారా ఎలో రేటింగ్‌ను మెరుగుపర్చుకున్నాను. ప్రస్తుతం 2675 రేటింగ్‌తో కొనసాగుతున్నాను. చెన్నై వేదికగా జూలైలో జరిగే ప్రతిష్ఠాత్మక చెస్ ఒలింపియాడ్ మొదలయ్యే నాటికి 2700 ఎలో రేటింగ్ చేరుకోవాలన్న లక్ష్యంతో ఉన్నాను. అందుకు అనుగుణంగా టోర్నీలను ఎంచుకుంటూ కీలక పాయింట్లు సాధించాలన్న పట్టుదలతో ఉన్నాను. ఒలింపియాడ్‌కు మరో రెండు నెలల సమయమున్నందున ఆలోగా అనుకున్న లక్ష్యాన్ని అందుకుంటానన్న గట్టి నమ్మకముంది. దేశ ర్యాంకింగ్స్ ప్రకారం చూస్తే ప్రస్తుతం నేను నాలుగో ర్యాంక్‌లో ఉన్నాను.
చెస్ ఒలింపియాడ్‌లో పోటీ ఎలా ఉంటుంది?
భారత్ వేదికగా తొలిసారి జరుగబోతున్న ప్రతిష్ఠాత్మక చెస్ ఒలింపియాడ్‌లో తీవ్ర పోటీ ఎదురయ్యే అవకాశముంది. నా అంచనా ప్రకారం అమెరికా, చైనా, రష్యా ప్లేయర్ల నుంచి దీటైన పోటీ ఉంటుంది. ర్యాంకింగ్స్ ఆధారంగా చెస్ ఒలింపియాడ్‌కు జట్లను ఎంపిక చేస్తారు. జాతీయ జట్టులో చోటు దక్కుతుందన్న నమ్మకం నాకు మెండుగా ఉంది. చెస్ ఐకాన్ విశ్వనాథన్ ఆనంద్ బరిలో దిగేది లేనిది ఇంకా ఖరారు కాలేదు. ఆనంద్ ప్రాతినిధ్యాన్ని బట్టి జట్టు ఎంపిక జరుగనుంది. ఒక్కో జట్టుకు ఐదుగురిని ఎంపిక చేస్తారు. చెస్ ఒలింపియాడ్ తర్వాత చైనాలో జరిగే ఆసియా గేమ్స్‌లో బరిలోకి దిగి సత్తాచాటాలని చూస్తున్నాను.
టోర్నీ టోర్నీకి మీ ప్రదర్శన ఎలా ఉంది?
గతేడాది జూలై నుంచి విరామం లేకుండా టోర్నీలు ఆడుతున్నాను. ఓవైపు ఎలో రేటింగ్‌ను మెరుగుపర్చుకోవడంతో పాటు ర్యాంకింగ్స్‌లో ముందంజ వేయాలన్న లక్ష్యాన్ని ఎంచుకున్నాను. చెస్ ఒలింపియాడ్‌కు ముందు కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుని మళ్లీ పోటీపడాలన్న ఉద్దేశంతో ఉన్నాను. అందుకు అనుగుణంగా టోర్నీలను ఎంపిక చేసుకొని ముందుకు సాగుతాను.