సూర్యాపేట టౌన్, నవంబర్ 4 : మునుగోడు ఉప ఎన్నికలో ప్రజల తీర్పు న్యాయం వైపే ఉండబోతుందనే విషయం స్పష్టంగా అర్థమవుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ముందుగా పోలింగ్‌లో పాల్గొన్న ఓటర్లకు, ఇన్ని రోజులు పనిచేసిన సహచర మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్తో పాటు వామపక్ష పార్టీల ప్రజాపత్రినిధులు, కార్పొరేషన్ చైర్మన్లు, నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
సూర్యాపేట జిల్లాకేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. మునుగోడు ఉప ఎన్నిక ఫలితం బీజేపీకి చెంప పెట్టుగా ఉండబోతుందన్నారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే కుట్రలో భాగంగానే ఉప ఎన్నిక తెచ్చారన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, అందుకు ప్రజలంతా అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ పన్నిన కుట్రలను తిప్పికొట్టారన్నారు.
ఆ విషయంలో తమ ఎమ్మెల్యేలు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి సాహసోపేతంగా వారి కుట్రలను బయట పెట్టారని తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా నిలిచి దేశ రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించడం ఖాయమన్నారు. అందుకు మునుగోడు ఉప ఎన్నిక ఫలితమే శ్రీకారం కాబోతుందని తెలిపారు. సమావేశంలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, ఎంపీపీ బీరవోలు రవీందర్‌రెడ్డి, జడ్పీటీసీ జీడీ.భిక్షం, మారిపెద్ది శ్రీనివాస్ పాల్గొన్నారు.