‘దశాబ్దాల తరబడి వివక్షకు గురై అభివృద్ధికి దూరమైన మునుగోడు నియోజకవర్గం సీఎం కేసీఆర్ పాలనలోనే సస్యశ్యామలమవుతున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా నల్లగొండ జిల్లా ప్రగతిలో దూసుకుపోతున్నది’. అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. కొరటికల్‌లో కూసుకుంట్ల ప్రచారాన్ని ప్రారంభించి మాట్లాడారు. అభివృద్ధిని అడ్డుకునేందుకే కేంద్రంలోని బీజేపీ సర్కారు కుట్ర పన్నిందని, అందులో భాగంగానే మునుగోడులో ఉప ఎన్నిక తెచ్చిందని విమర్శించారు. కేంద్రం పైసా ఇవ్వకున్నా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను నిరాంటంకంగా కొనసాగిస్తున్నామన్నారు. సీపీఎం, సీపీఐ మద్దతుతో ఎన్నికల్లో నిలబడిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని ఆశీర్వదించి గెలిపించాలని కోరారు.
మునుగోడు, అక్టోబర్ 10 : ‘సీఎం కేసీఆర్ పాలనలోనే మునుగోడు సస్యశ్యామలం అవుతుంది.. ఒక పార్టీ కుట్ర, ద్రోహుల రాజకీయ స్వార్థం కోసమే మునుగోడుకు ఉప ఎన్నిక వచ్చింది.. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు బీజేపీ కుట్రలు పన్నుతున్నది.. ఆ కుట్రలకు అండగా ఉంటున్న ఓ దొంగను కొన్నది’.. అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి విమర్శించారు. వామపక్షాలు బలపరిచిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి సోమవారం మునుగోడు మండలం కొరటికల్ గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.
దీనికి ముఖ్య అతిథులుగా మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ బడుగు లింగయ్య యాదవ్, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, సీపీఎం, సీపీఐ మాజీ ఎమ్మెల్యేలు జూలకంటి రంగారెడ్డి, పల్లా వెంకట్‌రెడ్డి, వామపక్ష నాయకులు హాజరయ్యారు. కూసుకుంట్ల ప్రచారానికి ప్రజలు అడుగడుగునా డప్పు చప్పుళ్లు, బోనాలతో వచ్చి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. బీజేపీ స్వార్థంతోనే ఈ ఎన్నికలు వచ్చాయన్నారు. రూ.22 వేల కోట్లకు అమ్ముడుపోయిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, రూ.18 వేల కోట్లకే అమ్ముడుపోయానని మీడియా సాక్షిగా ఒప్పుకున్నాడని తెలిపారు. సీమాంధ్ర పాలకుల హయాంలో నల్లగొండ జిల్లా ఎడారిగా ఉండేదని, స్వరాష్ట్రంలో సస్యశ్యామలం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందన్నారు.
కేసీఆర్ లేకుంటే నియోజకవర్గంలో నీళ్లు లేక కుటుంబాలు వలసలు పోయే పరిస్థితి ఉండేదని చెప్పారు. ఇక్కడి ఫ్లోరోసిస్ సమస్య గురించి గతంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముందుంచినా, ఎలాంటి చర్యలూ తీసుకోలేదని, కనీసం మంచినీటి సౌకర్యం కూడా కల్పించలేదని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే మిషన్ భగీరథ అమలై ప్రజలంతా సంతోషంగా జీవిస్తున్నారని తెలిపారు. ప్రజలకు మంచినీటి కోసం రూ.18 ఇవ్వని కేంద్రం, రాజగోపాల్‌రెడ్డికి రూ.18 వేల కోట్లకు కొన్నదని విమర్శించారు. గుజరాత్లో ముఖ్యమంత్రిగా మోదీ 14ఏండ్లలో చేయని అభివృద్ధిని, సీఎం కేసీఆర్ 14 నెలల్లోనే తెలంగాణలో చేసి చూపించారని చెప్పారు. వామపక్షాల మద్దతుతో మునుగోడులో టీఆర్ఎస్ జెండా ఎగురవేసి, దేశ రాజకీయాలకు వెళ్తున్న సీఎం కేసీఆర్‌కు కానుక ఇవ్వాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ ఆశీస్సులతో మూడోసారి మీ ముందుకొచ్చిన కుసుకుంట్లను మరోసారి దీవించాలని విజ్ఞప్తి చేశారు.
కొరటికల్‌లో ప్రజల ఆదరణ చూస్తుంటే.. గ్రామంలో 95శాతం ఓట్లు కారు గుర్తుకే పడుతాయనిపిస్తుంది. బీజేపీ నుంచి రూ.18వేల కోట్ల కాంట్రాక్టులు వచ్చాయని ఒప్పుకొన్న రాజగోపాల్‌రెడ్డికి ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేదు. కాంట్రాక్టుల కోసమే పనిచే పని చేసే రాజగోపాల్‌రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలి. కారు గుర్తుకు ఓటేసి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించాలి. సీఎం కేసీఆర్ దళితుల అభ్యున్నతికి దళిత బంధు పథకం అమలు చేస్తున్నారు. దేశంలో మోదీ ప్రజా వ్యతిరేక పాలనకు చరమగీతం పాడాలంటే కేసీఆర్‌తోనే సాధ్యం. అందుకే పక్క రాష్ర్టాలు కూడా కేసీఆర్‌కు, బీఆర్ఎస్కు మద్దతిస్తున్నాయి.
– బడుగుల లింగయ్యయాదవ్, రాజ్యసభ సభ్యుడు
కాంట్రాక్టుల కోసం అమ్ముడుపోయిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో ఈ ఉప ఎన్నిక వచ్చింది. తెలంగాణలో ప్రతిపక్ష హోదా కోసం మోదీ, అమిత్‌షా.. రాజగోపాల్‌రెడ్డిని అస్త్రంగా వాడుకుంటున్నారు. రాష్ట్రంలో 15ఏండ్లుగా పోటీలో ఉన్న బీజేపీకి ఒకటి, రెండు స్థానాలు తప్ప ఎక్కడా డిపాజిట్ కూడా దక్కలేదు. అదానీ, అంబానీల అప్పులను రద్దు చేసిన బీజేపీ.. సంపన్నుల పార్టీ అని మరోసారి నిరూపించుకున్నది. ప్రజలు, రైతులకు వ్యతిరేకమైన బీజేపీ సంపన్నులకే సొంతం. అటువంటి పార్టీని ఇక్కడ ఎలా గెలవనిస్తాం. అబద్ధపు మాటలు నమ్మకుండా బీజేపీ మతోన్మాద ఎజెండాను తుంగలో తొక్కి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించి నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేయాలి.
– పల్లా వెంకట్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి
కుట్ర పూరితంగా కొంత మంది స్వార్థపరులు తీసుకొచ్చిన ఎన్నిక ఇది. రాజగోపాల్‌రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం కాదు.. కాంట్రాక్టులు, సొంత లబ్ధి కోసమే రాజీనా మా చేశాడు. మోదీ ఒక దుర్మార్గుడు.. దేశాన్ని మొత్తం అమ్మేస్తుండు. మత కల్లోలాలు సృష్టి స్తూ ప్రజల్లో చిచ్చుపెట్టి మోసం చేస్తున్న బీజేపీకి ఓటేస్తే మనల్ని మనం నష్టపరుచుకున్నట్లే. తెలంగాణ రాష్ర్టాన్ని చిన్నాభిన్నం చేయడానికి మోదీ, అమిత్ షా చూస్తున్నారు. ప్రమాదకరమైన బీజేపీని తెలంగాణ గడ్డమీద అడుగు పెట్టకుండా చూడాలి. మునుగోడులో డిపాజిట్ రాకుండా చేస్తేనే తట్టబుట్ట సర్దుకొనిపోతుంది. గెలిచినా, ఓడినా నియోజకవర్గంలో ఉంటూ పనిచేస్తున్న కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించాలి.
– జూలకంటి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు