నల్లగొండ, జూన్ 7: ఉమ్మడి జిల్లాలో 4,400 చెరువులు ఉండగా అందులో మత్స్య శాఖకు చెందిన చెరువులు 1,261 ఉన్నాయి. వీటిలో దశాబ్దం క్రితం బాగా వర్షాలు వస్తే ఓ వంద చెరువుల దాకా నిండేవి. అప్పట్లో వాటిని కాంట్రాక్టర్లు తమ పరిధిలోకి తీసుకొని సర్పంచ్‌కు కొంత సొమ్ము ఇచ్చి చేప పిల్లలు పోసి చేతికి పంట వచ్చాక విక్రయించే వారు. సీజన్లో ఒకసారి అప్పట్లో చేపలు తిన్నారంటే మస్త్ ఖుషి. ఇప్పుడు సాగర్ ఎడమ కాల్వ, ఎత్తిపోతలు, ఎస్ఆర్ఎస్పీ, కాళేశ్వరం, మూసీ కారణంగా మత్య్స శాఖకు సంబంధించిన చెరువులే కాకుండా జిల్లాలో ఉన్న 4,400 చెరువులు నీళ్లతో తొణికిసలాడుతున్నాయి. దీనికి తోడు 2016 నుంచి రాష్ట్ర ప్రభు త్వం ప్రతి ఏటా ఉచితంగా అన్ని చెరువుల్లో చేప పిల్లలు పోస్తున్నది. దాంతో చేపల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. ప్రతి ఏటా జిల్లాలో సుమారుగా 45వేల టన్నుల కార్క్ చేపలు, 1,284 టన్నుల ఫ్రాన్స్ చేపలు ఉత్పత్తి అవుతుండగా వీటి ద్వారా ఏటా రూ.675 కోట్లు మత్స్య కారులు సముపార్జిస్తున్నారు.
మత్స్యకారులకు మంచి ఆదాయం..
ఉమ్మడి జిల్లాలో 424 మత్స్య సహకార సంఘాలు ఉండగా వాటిల్లో 43,700 మంది సభ్యత్వం కలిగి ఉండగా మరో 50 వేల మంది దాకా సభ్యత్వం లేకుండా మత్స్య వృత్తిపై ఆధార పడి జీవనం సాగిస్తున్నారు. రాష్ట్రం ఏర్పాటుకాక ముందు వృత్తిని వదిలి ఇతర పనులు చూసుకునే మత్స్యకారులు రాష్ట్రావతరణ తర్వాత చెరువులు నిండటం.. అందులో సర్కార్ చేపలు పోయడంతో తిరిగి వృత్తి వైపు మళ్లి జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలోని మత్స్య శాఖ చెరువులతో కలిపి కృష్ణానది, సాగర్ ప్రాజెక్ట్, మూసీ, అక్కంపల్లి, ఉదయ సముద్రం, ఎస్ఆర్ఎస్పీ , కాళేశ్వరం కాల్వల్ల్లో ఉండే చేపలు పట్టుకొని జీవనం సాగిస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పరిధిలోని బ్యాక్ వాటర్ సమీపంలో సుమారు 500 మంది మత్య్స కారులు నిత్యం చేపలు పట్టి ఇక్కడి అవసరాలు పోను హైదరాబాద్‌కు పంపిస్తున్నారు.
ఏటా రూ.600 కోట్లకు పైగా ఆదాయం
సహజంగా మన దగ్గర మాంస ప్రియులు ఎక్కువే. మాంసం మన అవసరాలకు తగిన విధంగా లేక పోవడంతో ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ తొలినాళ్లలోనే మాంసం కొరత తీర్చడానికి సబ్సిడీ గొర్రెలు, ఉచిత చేప పిల్లల పంపిణీ చేపట్టాడు. అందులో భాగంగానే 2016 నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం ఉమ్మడి జిల్లాకు ప్రతి ఏటా రూ.9.50 కోట్లు ఖర్చు చేసి తొమ్మిది కోట్ల చేప పిల్లలు చెరువుల్లో నీరు నింపి పోస్తున్నది. ఇప్పటి వరకు ఈ ఉచిత చేప పిల్లల కోసం రూ.66.5 కోట్లు ఖర్చు చేసింది. ఉమ్మడి జిల్లాలో ఏడేండ్ల కింద మూడు వేల టన్నుల చేపల ఉత్పత్తి ఉండగా ప్రస్తుతం 45వేల టన్నులకు రావడంతో పాటు రూ. 600 కోట్లకు పైగా ఆదాయాన్ని పొందగలుతున్నామని మత్స్య శాఖ అధికారులు అంటున్నారు.
మన చేపలకు మస్త్ గిరాకీ
ప్రస్తుతం జిల్లాలోని మత్స్య సంపద ఇక్కడి ప్రజలకు సరిపోయిన తర్వాత బయట రాష్ట్రాలకు మత్య్సకారులు ఎగుమతి చేస్తున్నారు. మన చెరువుల్లో బొచ్చ, రవ్వ, కట్ల, కొర్రమీను, మోసు, బురకలు, పాంప్లెట్లు, మార్పులు, బంగారుతీగతో పాటు ఫ్రాన్స్ రకం చేపలు ఉన్నాయి. ఇందులో ఎక్కువగా ఫ్రాన్స్ రకం చేప పశ్చిమ బెంగాల్‌కు ఎగుమతి చేస్తుండగా మిగిలిన చేపలు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడతో పాటు ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. ఇక్కడ మనకు చెరువు చేపలు కిలో రూ.100 నుంచి రూ.150 వరకు లభిస్తుండగా వ్యాపారులు రూ.180 నుంచి రూ.200 వరకు విక్రయిస్తున్నారు. అయితే పొరుగు రాష్ర్టాలకు కాస్త తక్కువ రేటుకు విక్రయిస్తున్నారు.
చేపల ఉత్పత్తి పది రెట్లు పెరిగింది
రాష్ట్ర వ్యాప్తంగా నల్లగొండలోనే చేపల ఉత్పత్తి ఎక్కువగా అవుతుంది. ప్రధానంగా సాగర్, మూసీ ప్రాజెక్టు పరిధిలో మత్య్స కారులు నిత్యం ఫిషింగ్ చేస్తారు. వీటిని ఇక్కడ అవసరాలు పోను ఇతర రాష్ట్రాలకు కూడా ఎగుమతి చేస్తారు. ఐదారేండ్లలో ఈ చేపల ఉత్పత్తి పది రెట్ల దాకా పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువగా కృత్రిమంగా చేపల పెంపకం చేస్తుం డగా మన దగ్గర సహజంగానే చెరువుల్లో పెంచడం వల్ల ఈ చేప రుచి బాగా ఉంటుంది.
-వెంకయ్య, జిల్లా మత్స్యశాఖ అధికారి, నల్లగొండ