కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ఉద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలపై కార్మికలోకం భగ్గుమన్నది. కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు చేపట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ఉమ్మడి జిల్లాలో విజయవంతంగా ముగిసింది. సుమారు రెండున్నర లక్షల మంది వివిధ రంగాల్లోని కార్మికులతోపాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు వివిధ రూపాల్లో భాగస్వాములయ్యారు. మంగళవారం సూర్యాపేట, యాదాద్రి కలెక్టరేట్ల వద్ద కార్మిక సంఘాలు ధర్నాలు నిర్వహించగా నల్లగొండలోని కార్మిక శాఖ కార్యాలయాన్ని ముట్టించారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోకపోతే పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
నిర్వహించగా నల్లగొండలోని కార్మిక శాఖ కార్యాలయాన్ని ముట్టించారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోకపోతే పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.కార్మిక చట్టాల సవరణను వ్యతిరేకిస్తూ.. పెట్రో ఉత్పత్తుల ధరలను నియంత్రించాలని, కనీస వేతనాన్ని పెంచాలని, 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని, ప్రభుత్వరంగ ఆస్తుల విక్రయాలను మానుకోవాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. కేంద్రంలోని మోదీ సర్కారు అత్యంత ప్రమాదకర విధానాలతో కార్మికుల ప్రయోజనాలను దెబ్బతీస్తుందని కార్మిక లోకం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై దశలవారీ పోరాటానికి పిలుపునిచ్చింది. ఉమ్మడి జిల్లాలోనూ కార్మిక సంఘాలు ఒకే తాటిపైకి వచ్చి సమ్మెలో పాల్గొన్నాయి. టీఆర్ఎస్కేవీ, సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ వంటి సంఘాలన్ని జేఏసీలా ఏర్పడి పోరాటంలో కదం తొక్కుతున్నాయి.
సమ్మె విజయవంతం
కార్మిక జేఏసీ సారథ్యంలో రెండు రోజుల పాటు నిర్వహించిన సమ్మె ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విజయవంతమైంది. తొలి రోజు జిల్లాలోని అన్ని మండల కేంద్రాలతో పాటు ముఖ్య పట్టణాల్లో భారీ ర్యాలీలు నిర్వహించారు. బహిరంగసభలు ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వ విధానాలను ఆయా సంఘాల నాయకులు ఎండగట్టారు. కార్మికులు, ఉద్యోగుల ప్రయోజనాలను దెబ్బతీయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ విధానాలు ఉన్నాయని విమర్శించారు. చౌటుప్పల్, బీబీనగర్ వంటి పారిశ్రామిక వాడల్లోనూ సమ్మె సక్సెస్ అయ్యింది. జిల్లావ్యాప్తంగా రైస్‌మిల్లులు, ఇతర పరిశ్రమలపై ప్రభావం కనిపించింది.
అన్ని రంగాల కార్మికుల భాగస్వామ్యం
వివిధ రంగాల హమాలీలు, ఆటో, ట్రాన్స్పోర్ట్, భవననిర్మాణ రంగ కార్మికులు, ఆశ, అంగన్వాడీ కార్యకర్తలు.. ఇలా అనేక రంగాల్లోని కార్మికులు, సిబ్బంది సమ్మెలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలైనా ఎల్ఐసీ, టెలికాం, పోస్టల్, రైల్వే ఉద్యోగ సంఘాలు సమ్మెలో పాల్గొన్నాయి. దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఉపాధ్యాయ సంఘాలు సైతం సమ్మెకు మద్దతు తెలిపాయి. రెండో రోజూ కూడా కార్మికులు, సిబ్బంది ర్యాలీలు, ధర్నాలు చేపట్టాయి. సూర్యాపేటలో కలెక్టరేట్ ఎదుట కార్మికులు ధర్నా చేపట్టి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు. నల్లగొండలోని కార్మిక శాఖ కార్యాలయాన్ని ముట్టడించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఆందోళన కొనసాగించారు. తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కార్మిక శాఖ అధికారులకు అందించారు.
మరిన్ని పోరాటాలు : జేఏసీ
కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలపై రానున్న కాలంలో మరిన్ని పోరాటాలకు సిద్ధమని కార్మిక సంఘాల జేఏసీ నేతలు ప్రకటించారు. టీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు గుర్రం వెంకట్‌రెడ్డి, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి స్పందిస్తూ రెండు రోజుల కార్మిక సమ్మె విజయవంతమైందని ప్రకటించారు. ఉమ్మడి జిల్లాలో సుమారు రెండున్నర లక్షల మంది సమ్మెలో భాగస్వాములయ్యారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఉద్యోగులు సైతం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, వారు కూడా సమ్మెకు మద్దతు తెలిపారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై జరిగే పోరాటాల్లో అన్ని వర్గాల ప్రజలు కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు.