నేరేడుచర్ల, మార్చి 22 : పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, చక్కటి వసతితోపాటు వారి భవితకు గురుకుల పాఠశాలలు చిరునామాగా నిలుస్తున్నాయి. గురుకులాల్లో ఇంగ్లిష్ మాధ్యమంలో విద్యాబోధన అందిస్తున్నారు. దాంతో ఉత్తమ ఫలితాలు సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న ఈ పాఠశాలల్లో ప్రవేశాలకు పోటీ ఎక్కువగానే ఉంటుంది. ప్రతి యేటా 5వ తరగతిలో ప్రవేశాలకు ఎంట్రెన్స్ నిర్వహిస్తారు. వేల సంఖ్యలో విద్యార్థులు పరీక్షకు హాజరవుతారు. ఇందులో సీటు సాధిస్తే పదో తరగతి వరకు నాణ్యమైన విద్య అందుతుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 28 గురుకుల పాఠశాలలు ఉండగా ఒక్కో పాఠశాలలో 80 మంది సీట్లు పొందేందుకు అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఒకే నోటిఫికేషన్
గతంలో వేర్వేరుగా నోటిఫికేషన్లు ఇచ్చే గురుకుల విద్యాలయాలు 2022-2023 విద్యా సంవత్సరం ప్రవేశ పరీక్ష కోసం ఒకే నోటిఫికేషన్ విడుదల చేశాయి. దరఖాస్తుల కోసం ఇప్పటికే సాంఘిక సంక్షేమ, గిరిజన, మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకులం, తెలంగాణ గురుకుల పాఠశాలలు ప్రచారం ప్రారంభించాయి. అర్హులైన విద్యార్థుల నుంచి ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చేలా కృషి చేస్తున్నారు.
ప్రవేశ పరీక్ష, రిజర్వేషన్ల ప్రాతిపదికన సీట్లు..
సాంఘిక సంక్షేమ, గిరిజన, మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ, తెలంగాణ గురుకులాల్లో 5వ తరగతికి సంబంధించి ఒక్కో పాఠశాలలో 80 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ నెల 28లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ప్రవేశ పరీక్ష మే 8న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తారు. ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కులు, రిజర్వేషన్ల ఆధారంగా ఆయా గురుకులాల్లో సీట్లను కేటాయిస్తారు.
అర్హులు వీరే..
గురుకుల పాఠశాలలో చేరేందుకు ప్రస్తుతం 4వ తరగతి చదువుతూ ఉండాలి. బీసీ, ఓసీ కులాలకు చెందిన వారు 01-08-2011 నుంచి 31-08-2013 లోపు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 01-09-2009 నుంచి 31-08-2013లోపు జన్మించిన వారు అర్హులు.
విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం 2021-22 సంవత్సరానికి గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల వారికి రూ.2లక్షల లోపు మాత్రమే ఉండాలి.
దరఖాస్తు చేసుకునే విధానం..
ఈ ఏడాది నుంచి అన్ని కేటగిరీల కింద ఉన్న గురుకులాలకు ఒకే ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. http//cet.cgg.gov.in లాగిన్ అయ్యి విద్యార్థి పేరు, పుట్టిన తేది, ఫోన్ నంబర్, జిల్లా పేరు, ఆధార్ నంబర్ నమోదు చేసి రూ.100 ప్రవేశ రుసుము క్రెడిట్, డెబిట్, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు. వేరే వారి ఫొటోలతో దరఖాస్తు చేస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటారు.
గురుకులాల ప్రత్యేకతలు
అనుభవం ఉన్న ఉపాధ్యాయులతో బోధన, ఉత్తమ పర్యవేక్షణ, ఐఐటీ, ఎంసెట్ లాంటి పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తూ ఉత్తమ ర్యాంకులతో ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థల్లో చేరేలా ప్రోత్సహిస్తారు.
విద్యతోపాటు క్రీడలు, సాంస్కృతిక అంశాలపై విద్యార్థులను ప్రోత్సహిస్తారు. యోగాలో శిక్షణ ఇస్తారు.
విద్యార్థులకు సన్న బియ్యంతోపాటు పోషకాలతో కూడిన రుచికరమైన భోజనం పెడుతారు.
మూడు జతల ఏకరూప దుస్తులు, పాఠ్య, నోటు పుస్తకాలు ఉచితంగా అందజేస్తారు.