యాదాద్రి, మార్చి14 : యాదాద్రి ప్రాశస్త్యాన్ని ప్రపంచానికి చాటిచెప్తున్న మహనీయుడు సీఎం కేసీఆర్ అని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ కొనియాడారు. ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం ఏర్పాటులో భాగస్వామ్యం కావాలని సీఎం కేసీఆర్ పిలుపు మేరకు కిలో 580 గ్రాముల బంగారాన్ని ఆలయ ఈఓ ఎన్.గీతకు అందించారు. సోమవారం ఆయన కుటుంబసమేతంగా స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రధానార్చక బృందం ఆలయ సంప్రదాయరీతిలో స్వాగతం పలికి బాలాలయ ముఖ మండపంలో స్వామి ఆశీర్వచనాలు అందించింది.
అనంతరం యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచంలో ఇప్పటివరకు ఎవరూ చేయని ఆయుత చండీయాగం నిర్వహించి యావత్ రాష్ర్టాన్ని సుభిక్షం చేసిన దార్శనికుడు సీఎం కేసీఆర్ అన్నారు. నాటి నుంచి రాష్ర్టాల్లో వర్షాలు భారీగా కురుస్తున్నాయన్నారు. గత ప్రభుత్వాలు ఆలయాలను ఆదాయ వనరులుగా మాత్రమే చూశాయని పేర్కొన్నారు. పలు పార్టీలు మతాలు, కులాలను రాజకీయాలకు వాడుకుంటూ పబ్బం గడుపుతున్న ప్రస్తుత రోజుల్లో నిజమైన హిందువుగా సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.
ఇలాంటి ముఖ్యమైన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న సీఎం కేసీఆర్‌పై లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులు కలకాలం ఉండాలని నియోజకవర్గ ప్రజల తరపున యాదాద్రీశుడిని వేడుకున్నట్లు తెలిపారు. విమానగోపురం స్వర్ణతాపడానికి నియోజకవర్గం నుంచి కిలోన్నర బంగారం సమర్పించినట్లు తెలిపారు. అందులో తమ కుటుంబం తరపున 250గ్రాములు, ఇమ్మడి సోమనర్సయ్య బ్రదర్స్ 250గ్రాములు, సూర్యాపేట జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపిక దంపతులు 10గ్రాములు, నేవూరి ధర్మేందర్‌రెడ్డి 60గ్రాములు, మోత్కూరు ఎంపీపీ రచ్చ కల్పన దంపతులు 50గ్రాములు, జడ్పీటీసీ శారద దంపతులు 50గ్రాములు, సామ ఆంజనేయులు 50గ్రాములు, నల్లు రాంచంద్రారెడ్డి 50గ్రాములు, గుండా శ్రీనివాస్ 50గ్రాములు వీరితో పాటు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు తమవంతు అందించినట్లు వివరించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, సూర్యాపేట జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపిక, టీఆర్ఎస్ నాయకులు నేవూరి ధర్మేంధర్‌రెడ్డి టీఆర్ఎస్వీ నాయకులు శోభన్ పాల్గొన్నారు.