నిడమనూరు, మార్చి 14 : శివసత్తుల పూనకాలు, గజ్జెల లాగులు ధరించిన యాదవుల విన్యాసాలు, బోనాలతో తరలివచ్చిన మహిళలతో ఎర్రబెల్లి లింగమంతుని గట్టు కిటకిటలాడింది. లింగా.. ఒ లింగా అంటూ భక్తుల స్మరణతో మార్మోగింది. మండలంలోని ఎర్రబెల్లి లింగమంతుల స్వామి జాతరలో భాగంగా సోమవారం తెల్లవారు జామున యాదవులు తల్లిగంపను మేళతాళాల మధ్య గట్టుకు తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం యాదవ పూజారులు మాణిక్యాలదేవి, లింగమంతుల స్వామి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున యాటలు బలిచ్చారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మన్నెం రంజిత్ యాదవ్ దంపతులు స్వామి వారి కల్యాణంలో పాల్గొన్నారు.
భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామి వారిని దర్శించుకొని, మొక్కులు చెల్లించారు. యాటలు బలిచ్చి గట్టు కింద టెంట్లు వేసుకొని విందు భోజనాలు చేశారు. దాంతో రోడ్డు వెంట 5 కిలోమీటర్ల మేర టెంట్లు దర్శనమిచ్చాయి. గట్టువైపునకు వెళ్లే దారులన్నీ వాహనాలతో నిండిపోగా పోలీసులు ట్రాపిక్‌ను క్రమబద్ధీకరించారు. హాలియా సీఐ బి.సురేశ్ కుమార్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎంపీపీలు బొల్లం జయమ్మ, పేర్ల సుమతి, డీసీసీబీ డైరెక్టర్ విరిగినేని అంజయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తాటి సత్యపాల్, మాజీ జడ్పీటీసీ కొండేటి మల్లయ్య, దేవస్థాన చైర్మన్ మన్నెం వెంకటరమణ, పీఏసీఎస్ వైస్ చైర్మన్ సిరిగిరి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ మన్నెం వెంకన్న యాదవ్, నాయకులు అంకతి సత్యం, నందికొండ మట్టారెడ్డి, కొండ శ్రీనివాస్‌రెడ్డి, శివమారయ్య, లకుమాల మధుబాబు, పెదమాం మధు, సిరిగిరి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.