చివ్వెంల, మార్చి 1 : సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని కుడకుడలో సోమవారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసిన రెండిండ్లలో చోరీ చేసి బంగారం, నగదు అపహరించారు. మంగళవారం మహాశివరాత్రి సందర్భంగా కుడకుడకు చెందిన దండుగుల ఎల్లయ్య సోమవారం సాయంత్రం ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి నల్లగొండ జిల్లా చెర్వుగట్టు ఆలయానికి వెళ్లాడు. అర్ధ్దరాత్రి దుండగులు ఇంటి తాళం పగులగొట్టి బీరువా ధ్వంసం చేసి 2.5 తులాల బంగారు ఆభరణాలు, 63 వేల నగదు అపహరించారు. పక్కనే ఉన్న చిన్నిపెల్లి గిరి ఇంటి తాళాలు సైతం ధ్వంసం చేసి 7వేల నగదు, పావుతులం బంగారం చోరీ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విష్ణు తెలిపారు.
నల్లగొండ శ్రీనగర్ కాలనీలో ..
నీలగిరి : నల్లగొండ పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో తాళం వేసిన ఓ ఇంట్లో దుండగులు చోరీ చేశారు. బీరువాలోని 2 తులాల బంగారం, 46 వేల నగదు అపహరించారు. శ్రీనగర్ కాలనీకి చెందిన నాగులవంచస్వామి పట్టణంలో ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్నాడు. సోమవారం ఇంట్లో ఎవరూ లేకపోవడంతో మధ్యాహ్నం తాళం వేసి విధులకు వెళ్లాడు. రాత్రి 9 గంటల సమయంలో తిరిగి రావడంతో ఇంటి తలుపులు పగులగొట్టి ఉన్నాయి. బీరువాలోని 2 తులాల బంగారం, 46 వేల నగదు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. టూటౌన్ పోలీసులు ఇంటి పరిసర ప్రాంతాలను పరిశీలించారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. కేసు నమోదు చేస్తున్నట్లు టూటౌన్ ఎస్ఐ రాజశేఖర్రెడ్డి తెలిపారు.