యాదాద్రి, మార్చి 1: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి అనుబంధ శివాలయంలో మంగళవారం రాత్రి నిత్య పారాయణాల అనంతరం లింగోద్భవ కాలమున పర్వత వర్ధినీ సమేత రామలింగేశ్వర స్వామికి మహాన్యాస పూర్వక శత రుద్రాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం శివాలయంలో వేదమూర్తులైన బ్రాహ్మణోత్తములతో నిత్యహవనములు, శివ పంచాక్షరీ జపములు, నందీశ్వర పారాయణాలు, పంచసూక్త పఠనం గావించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశికధర్మకర్త బి.నరసింహమూర్తి, ఈఓ ఎన్.గీత, శివాలయ ప్రధానార్చకుడు నరసింహరాములు శర్మ, ప్రధాన పురోహితుడు గౌరీభట్ల సత్యనారాయణ శర్మ, అర్చకులు పాలకుర్తి నర్సింహమూర్తి, శ్రీనివాసశర్మ, నందిభట్ల సాయికృష్ణ శర్మ, పురోహితులు నాగరాజు శర్మ, అధికారులు పాల్గొన్నారు.
బాలాలయంలో..
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి బాలాలయంలో ఆర్జిత పూజల కోలాహలం నెలకొన్నది. సుప్రభాత సేవ మొదలుకుని నిజాభిషేకం వరకు కోలాహలంగా పూజలు కొనసాగాయి. నిత్యపూజల్లో భాగంగా మొదటగా స్వామివారి బాలాలయంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, లక్ష్మీనరసింహుల నిత్య తిరుకల్యాణోత్సవం శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఆలయ మహామండపంలో అష్టోత్తరం జరిపించారు. సాయంత్రం అలంకార జోడు సేవోత్సవాన్ని సంప్రదాయంగా నిర్వహించారు. స్వామి సన్నిధిలో క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి ఆకుపూజ పర్వాలు శాస్ర్తోక్తంగా జరిగాయి. విష్ణుపుష్కరిణి చెంత కొలువుదీరిన క్షేత్రపాలకుడిని కొలుస్తూ అర్చకులు పంచసూక్తాలు, మన్యుసూక్త పఠనాలతో అభిషేకించారు. సింధూరం, వివిధ రకాల పూలతో అలంకరించారు. లలితా పారాయణం చేసి స్వామివారికి ఇష్టమైన వడపప్పు, బెల్లం, అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించారు. శ్రీవారి ఖజానాకు మంగళవారం రూ.7,27,252 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.