సూర్యాపేట జిల్లావ్యాప్తంగా మహాశివరాత్రి పర్వదిన వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఉదయం నుంచే ఆలయాల్లో భక్తుల సందడి కనిపించింది. శివాలయాల్లో స్వామివారికి మహా రుద్రాభిషేకం, జలాభిషేకం, లక్ష బిల్వార్చన తదితర పూజలు నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున హాజరై కుంకుమ పూజలు చేశారు. రాత్రి శివపార్వతుల కల్యాణం కమనీయంగా జరిగింది. మఠంపల్లి మండలం మట్టపల్లి లక్ష్మీనరసింహ వేద పాఠశాలలో పండితుడు చీమలపాటి ఫణిశర్మ ఆధ్వర్యంలో విద్యార్థులు మహాలింగార్చన నిర్వహించారు.
జిల్లా కేంద్రంలోని వీరభద్రస్వామి, విశ్వనాథస్వామి, పిల్లలమర్రి శివాలయాల్లో విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి -సునీత దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి, మేళ్లచెర్వు శివాలయం, యాతవాకిళ్ల బసవేశ్వరస్వామి ఆలయం, నేరేడుచర్ల మండలం బూర్గులతండా సోమేశ్వరస్వామి ఆలయాల్లో హుజూర్నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి పూజల్లో పాల్గొన్నారు. చిలుకూరు శివాలయంలో కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ పూజల్లో పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు. ఆలయ కమిటీ సభ్యులు ప్రభబండ్ల ర్యాలీ, కోలాటం పోటీలు నిర్వహించారు. కోదాడలోని అయ్యప్ప ఆలయ ఆవరణలోని శివాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాలికల నృత్య ప్రదర్శన అలరించింది.