పెన్‌పహాడ్, మార్చి 1 : తెలంగాణ రాకతో మరుగునపడ్డ దేవాలయాలు పునఃనిర్మాణాలకు నోచుకుంటున్నాయని, సంస్కృతి, సంప్రదాయాలకు పునరుజ్జీవం కలుగుతుందని మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. మండలంలోని నాగులపహాడ్‌లోని త్రికుటేశ్వర ఆలయాన్ని మంగళవారం మంత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి పాలనలో కాకతీయుల కళా సంపద శిథిల సాక్షాలకు నిలువెత్తు నిదర్శనం అయిన నాగులపహాడ్ దేవాలయాలు కనుమరుగు అవుతున్నా ఆనాటి పాలకులకు పట్టింపు లేదన్నారు. తెలంగాణ రాకతో మరుగున పడ్డ దేవాలయాలు పునఃనిర్మాణాలకు నోచుకుంటున్నాయన్నారు. భక్తులు ముందుకు వచ్చి సౌకర్యాల కల్పనకు సహకారం అందించడం సంతోషకరమన్నారు. శివ పార్వతుల శాశ్వత కల్యాణ మండప నిర్మాణానికి సహకరించిన ముత్తినేని మట్టయ్యను మంత్రి అభినందించారు. కార్యక్రమంలో ఎంపీపీ నెమ్మాది భిక్షం, జడ్పీటీసీ మామిడి అనితాఅంజయ్య, పీఏసీఎస్ చైర్మన్లు నాతాల జానకీరాంరెడ్డి, వెన్న సీతారాంరెడ్డి, సర్పంచులు రాయిలీ లక్ష్మి, మండలి మల్లయ్య, ఉత్సవ కమిటీ చైర్మన్ కొండ జానకీరాములు, శ్రవణ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, కృష్ణారెడ్డి, దొంగరి యుగేంధర్, అనంతుల శ్రీనివాస్‌గౌడ్, మామిడి అంజయ్య పాల్గొన్నారు.