మేళ్లచెర్వు, మార్చి 1 : మేళ్లచెర్వు స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం మహా శివరాత్రి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. తెల్లవారు జాము నుంచి స్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు. వేల మంది భక్తజనం తరలిరావడంతో ఆలయ ఆవరణలో సందడి నెలకొంది. వేకువజామున స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సతీసమేతంగా వచ్చి అభిషేక పూజలు ప్రారంభించారు. ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దంపతులు, జిల్లా కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి, హుజూర్నగర్, కోదాడ, సూర్యాపేట ఆర్డీఓలు వెంకారెడ్డి, కిశోర్‌కుమార్, రాజేందర్, బీజేపీ నాయకుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు విష్ణువర్ధన్‌శర్మ, ధనుంజయశర్మ అమ్మవారికి మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, కుంకుమార్చనలను శాస్ర్తోక్తంగా నిర్వహించారు. కార్యక్రమాల్లో ఈఓ గుజ్జుల కొండారెడ్డి, ఉత్సవ కమిటీ చైర్మన్ కమతం సత్యనారాయణ పాల్గొన్నారు.
జాతర సందడి..
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మేళ్లచెర్వులోని ఆలయ ప్రాంగణంలో ఐదు రోజులపాటు కొనసాగే జాతర ప్రారంభమైంది. కొనుగోలు దుకాణాల వద్ద పెద్ద సంఖ్యలో భక్తులు సందడి చేశారు. జెయింట్ వీల్స్, రంగుల రాట్నం, ఇతర క్రీడా ప్రాంగణాల వద్ద చిన్నారులు ఆడిపాడారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు, అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మైహోం సిమెంట్స్ ఆధ్వర్యంలో మంచినీటి కేంద్రం, ప్రథమ చికిత్సా కేంద్రంతో పాటు ఎన్ఎస్పీ కాల్వ మీద తాత్కాలిక వంతెనను ఏర్పాటు చేశారు. విశ్వమానవ కల్యాణం కోసం శ్రీమాతా చారిటబుల్ ట్రస్ట్ కొంకపాక రాధాకృష్ణమూర్తి ఆధ్వర్యంలో మహారుద్రయాగ సహిత శత చండీ విశ్వశాంతి మహాయాగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సైదిరెడ్డి ప్రారంభించారు.
ఓజో ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదానం..
జాతరకు వచ్చే భక్తులకు ఓజో ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. చైర్మన్ పిల్లుట్ల రఘు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఐదు రోజుల పాటు నిరంతరాయంగా అన్నదానం కొనసాగనున్నట్లు తెలిపారు. ఎద్దుల పందాల్లో (బండ లాగుడు) భాగంగా టచ్ పళ్ల విభాగ పోటీలను ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో దాతలు, గ్రామపెద్దలు, నాయకులు పాల్గొన్నారు.