సూర్యాపేట, మార్చి 1 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నది. ఇప్పటికే ప్రధానోపాధ్యాయుల సూచనల మేరకు ఇందుకు ప్రణాళికలు సిద్ధ్దం చేసింది. జిల్లాలోని 175 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, 18 కస్తూర్బా గాంధీ పాఠశాలలు, 9 మోడల్ స్కూళ్లు, మైనార్టీ పాఠశాలలు, 4 బీసీ వెల్ఫేర్ పాఠశాలలు, 8 ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలు, 11 సోషల్ వెల్ఫేర్, ఆశ్రమ పాఠశాల, అర్బన్ రెసిడెన్సియల్ పాఠశాలలు ఒక్కొక్కటి ఉన్నాయి. ఆయా పాఠశాలల నుంచి ఈ విద్యా సంవత్సరం 8,317 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు విద్యార్థ్ధులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు.
పక్కాగా ప్రణాళిక అమలు
పదో తరగతిలో ఈ ఏడాది ఉత్తమ ఫలితాలు సాధించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తున్నది. అందుకు అనుగుణంగా ప్రణాళికను రూపొందించి ఇప్పటికే జిల్లాలోని 238 ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్నది. మార్చి 14 నాటికి ఆయా సబ్జెక్టుల సిలబస్ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవడమే కాకుండా వెనుకబడిన విద్యార్థ్ధులపై ప్రత్యేక శ్రద్ధ్ద వహించాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించింది. తల్లిదండ్రులతో విద్యార్థుల ప్రగతిపై ఆరా తీస్తూ ఉత్తీర్ణతశాతం పెంచేలా కృషి చేస్తున్నది.
ఉత్తీర్ణత శాతం పెంచే దిశగా..
పదో తరగతి విద్యార్థ్ధులకు సకాలంలో సిలబస్ పూర్తి చేయడంతోపాటు ఆయా సబ్జెక్టుల్లో వారు నైపుణ్యం సాధించేలా చదివించేందుకు ప్రత్యేక తరగతులను విద్యాశాఖ ప్రారంభించింది. విద్యార్థ్ధులకు ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు, సాయంత్రం 4.45 నుంచి 5.45 వరకు ఉపాధ్యాయులు అదనపు తరగతులను నిర్వహిస్తున్నారు. జనవరి నుంచి నిత్యం ఓ సబ్జెక్టుపై విద్యార్థ్ధులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. అనంతరం విద్యార్థ్ధులకు గ్రాండ్ టెస్టులు నిర్వహించి వారిని ఫ్రీ-ఫైనల్‌కు సిద్ధ్దం చేస్తున్నారు.
జిల్లాను ప్రథమ స్థానంలో నిలుపడమే లక్ష్యం
పదో తరగతి ఫలితాల్లో జిల్లాను ప్రథమ స్థానంలో నిలుపడమే లక్ష్యం. విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి ఫలితాల్లో నంబర్ వన్‌గా నిలిచేలా పాఠశాలల్లో పత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నాం. విద్యార్థ్ధులకు పరీక్షలంటే భయం పోయి మానసికంగా సిద్ధ్దమయ్యేలా చూస్తున్నాం. సబ్జెక్టులపై పట్టు సాధించేలా ఉదయం, సాయంత్రం అదనపు తరగతులు నిర్వహిస్తున్నాం. పాఠశాలల్లో అదనంగా ఉన్న ఉపాధ్యాయులకు ప్రత్యేక తరగతుల నిర్వహణ బాధ్యతలు అప్పగించాం.
– అశోక్, జిల్లా విద్యాశాఖ అధికారి, సూర్యాపేట