చింతలపాలెం, జూన్ 30 : ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్లాలని సూచించారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో అందరూ భాగస్వాములై పని చేయాలన్నారు.
గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులను సోషల్ మీడియాతో ప్రచారం చేయాలని సూచించారు. అదేవిధంగా గ్రామాల్లో ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి కృషి చేయాలన్నారు. నియోజకర్గంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పరుగులు పెడుతున్నదన్నారు. గత ప్రభుత్వాల పాలనలో అభివృద్ధి శూన్యమని, ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతి పక్ష నేతలు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం అభివృద్ధి పనులు మరుగున పడకుండా గడపగడపకు తిరిగి తెలియజేయాలన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ప్రతి గ్రామానికీ డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు, నర్సరీలు, హరితహారాలు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు, క్రీడా ప్రాంగణాలు, సెగ్రిగేషన్ షెడ్లు, రైతుబంధు, రైతు బీమా లాంటి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని కొనియాడారు. కార్యక్రమంలో ఎంపీపీ కొత్తమద్ది వెంకట్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, వైస్ ఎంపీపీ శ్రీనివాస్‌రావు, డీసీసీబీ డైరెక్టర్ రంగాచారి, ఎంపీటీసీ సైదిరెడ్డి, నాయకులు మతీన్, గని, సుబ్బారావు, పప్పుజాన్, ఆంజనేయులు, నర్సిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీను, హనుమంతరావు, సర్పంచులు, నాయకులు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు.
హుజూర్నగర్ : ఇంటర్లో ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు వైష్టవి, ఉదయ్, అభిలాష్, లక్ష్మి, క్రాంతి శ్రీ, వీరేశ్, ఆకాశ్‌ను ఎమ్మెల్యే సైదిరెడ్డి క్యాంపు కార్యాలయంలో గురువారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు జీవితంలో ఉన్నత శిఖరాలు అందుకోవాలని ఆకాంక్షించారు.