జిల్లాలో అట్టహాసంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు కలెక్టరేట్లో జాతీయ జెండా ఎగురవేసిన
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్ తెలంగాణ అమరవీరులకు నివాళులు పాల్గొన్న ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, జడ్పీచైర్మన్ సందీప్‌రెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి ప్రభుత్వ ఫలాలు, జిల్లా ప్రగతిని వివరించిన ఏకే ఖాన్ లబ్ధిదారులకు దళిత బంధు యూనిట్ల పంపిణీ తెలంగాణ అవతరణ పండుగను గురువారం జిల్లా ప్రజలు గుండెల నిండా అభిమానంతో నిర్వహించుకున్నారు. కరోనా కారణంగా రెండేండ్ల అనంతరం వేడుకలు ఘనంగా జరిగాయి. ఊరూవాడ, పల్లె, పట్నం అనే తేడాలేకుండా జనం ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో జాతీయ జెండాలను ఎగురవేశారు. తెలంగాణ తల్లి విగ్రహాలకు పూల మాలలు వేసి అమరవీరులకు నివాళులర్పించారు. కలెక్టర్‌లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్ జాతీయ జెండాను ఎగుర వేసి మాట్లాడారు.
భువనగిరి కలెక్టరేట్, జూన్ 2 : తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన కొద్ది కాలంలోనే అత్యుత్తమంగా అభివృద్ధి సాధించి దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా గురువారం ఉదయం పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో జాతీయ జెండాను ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వరాష్ట్ర సాధనే ధ్యేయంగా ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేశారన్నారు. ఆత్మ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన కృషి అనిర్వచనీయమన్నారు.
పాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో అన్ని వర్గాలకు పూర్తిస్థాయిలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కిందన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో చిరస్థాయి కీర్తిని సాధించుకుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అమలవుతున్న పథకాలు ప్రతి ఒక్కరికీ అందుతున్నాయని చెప్పారు. అనతి కాలంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందు వరుసలో నిలిచిందన్నారు. ప్రభుత్వ పథకాలు జిల్లావ్యాప్తంగా అన్ని వర్గాలకు అందుతున్నాయని పేర్కొన్నారు. ఆడబిడ్డల పెండ్లికి షాదీముబారక్, కల్యాణలక్ష్మి పథకాలు పేదింట వెలుగులు ప్రసరింపజేస్తున్నాయని తెలిపారు.
దళిత బంధు పథకంతో దళితులు ఆత్మగౌరవంతో సగౌరవంగా ఆర్థిక పరిపుష్ఠి సాధిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి వేగవంతంగా జరుగుతున్నదని, ఎక్కడా ఎలాంటి ఇబ్బందులకు ఆస్కారాలు లేకుండా సమగ్రాభివృద్ధికి చర్యలు చేపడుతున్నారని అన్నారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. అనంతరం కవి సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్లు దీపక్ తివారీ, డి.శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీఓ భూపాల్‌రెడ్డి, జిల్లా పరిషత్ సీఈఓ కృష్ణారెడ్డి, డీఆర్డీఓ ఉపేందర్‌రెడ్డి, డీసీపీ కె.నారాయణరెడ్డి, వైద్యారోగ్య శాఖ అధికారి మల్లికార్జునరావు, సీపీఓ మాన్యనాయక్, డీపీఓ సునంద, కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి నాగేశ్వరాచారి వివిధ శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
భువనగిరి అర్బన్ : దళిత బంధు పథకం కింద మండలంలోని తాజ్పూర్ గ్రామంలో 27 కుటుంబాలను ఎంపిక చేశారు. ఇందులో ఇప్పటి వరకు 19 మందికి సంబంధిత పథకాలు అందజేశారు. మిగిలిన ఎనిమిది మందికి కలెక్టరేట్లో గురువారం జరిగిన కార్యక్రమంలో అందించారు. ఆరుగురికి ట్రాక్టర్లు, ఒకరికి షిప్టు కారు, ఒకరికి టాటా ఏస్ వాహనాన్ని జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్ అందజేశారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జినుకల శ్యామ్‌సుందర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, ఎంపీపీ నరాల నిర్మలావెంకటస్వామి, గ్రామ సర్పంచ్ బొమ్మారపు సురేశ్, ఉప సర్పంచ్ ర్యాకల సంతోష, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ర్యాకల శ్రీనివాస్ పాల్గొన్నారు.
