నల్లగొండ ప్రతినిధి, జూన్2 (నమస్తే తెలంగాణ) : ఇప్పటివరకు పలు దఫాలుగా చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు దేశానికే రోల్ మోడల్‌గా నిలిచాయని, నేటి నుంచి ప్రారంభమయ్యే మరో విడుత కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. 15రోజులపాటు నిర్వహించే ప్రగతి కార్యక్రమాల్లో అన్ని స్థాయిల్లోని ప్రజాప్రతినిధులు, వివిధ వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేస్తూ విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
నల్లగొండ కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో ఉమ్మడి జిల్లాలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల నిర్వహణపై ప్రజాప్రతినిధులు, అధికారులతో గురువారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా సమన్వయంతో పకడ్బందీగా పల్లె ప్రగతి నిర్వహించాలన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పల్లె, పట్టణ ప్రగతితో పౌరులకు సేవలు, వసతుల కల్పనలో మనకు మనమే పోటీ పడే స్థాయిలో ఉన్నామని, ఇతర ఏ రాష్ట్రం మన దరిదాపుల్లో లేదన్నారు.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ గ్రామాల్లో తొలి 10కి పది, 20లో 19 పల్లెలు రాష్ర్టానివే కావడం గర్వకారణమని అభిప్రాయపడ్డారు. వీటన్నింటికీ పల్లె ప్రగతిలో చేసిన కార్యక్రమాలే గీటురాళ్లని, అందుకు సీఎం కేసీఆర్ నాయకత్వమే కారణమని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ కేవలం ఎనిమిదేండ్లలోనే ఎన్నో పథకాలతో రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని కొనియాడారు. పథకాల అమలులో కలెక్టర్ నుంచి గ్రామస్థాయి అధికారుల పాత్ర అభినందనీయమన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజల మధ్యలో ఉంటూ నిత్యం అభివృద్ధికి పరితపిస్తున్నారని, వారి చిత్తశుద్ధి, సేవలు ప్రశంసనీయమని అన్నారు.
గ్రామీణ క్రీడా ప్రాంగణాల విషయంలో ఎమ్మెల్యేలు, గ్రామాలకు సంబంధించిన యువతను భాగస్వామ్యం చేస్తూ క్రీడలకు అనువైన స్థలాలను ఎంపిక చేయాలని సూచించారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే పూర్తి చేసిన వైకుంఠధామాల్లో బోర్లు వేసి నీటి సదుపాయం, విద్యుత్ సౌకర్యం కల్పనకు చర్యలు తీసుకోవాలన్నారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై స్థానికంగా ఎమ్మెల్యేలు సమీక్షలు నిర్వహించాలని సూచించారు.
పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డులు తీసుకోవడం అక్కడి పెద్దలకు నచ్చడం లేదని మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. అందుకే రాష్ర్టాభివృద్ధికి ఆటంకాలు సృష్టించేలా కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. డిస్కంలకు రుణాలు రాకుండా అడ్డుపడడం అందులో భాగమేనన్నారు. రాష్ట్రంలో నిరంతరాయంగా కరెంటు సరఫరా జరగుతుంటే, దాన్ని రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు కేంద్రం చేయడం దుర్మార్గమన్నారు. ఇలాంటి కేంద్ర ప్రభుత్వ దుర్మార్గాలను ఎదుర్కొంటూ సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్నారన్నారు. అభివృద్ధిలో మనకెవరూ సాటిలేరని, మన రికార్డులను మనమే బ్రేక్ చేసేలా ముందుకు సాగాలని, ఇందులో ప్రజాప్రతినిధులు, అధికారుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లాల వారీగా కలెక్టర్లు 15రోజుల పాటు నిర్వహించే పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల షెడ్యూల్‌ను వివరించారు. ప్రతి గ్రామం, వార్డుల్లోనూ పారిశుధ్యం పచ్చదనం పెంపు, మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా కార్యక్రమాలకు రూపకల్పన చేసినట్లు తెలిపారు. సమావేశంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, జడ్పీ చైర్మన్లు బండా నరేందర్‌రెడ్డి, గుజ్జ దీపిక, ఎలిమినేటి సందీప్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్రకుమార్, నల్లమోతు భాస్కర్‌రావు, చిరుమర్తి లింగయ్య, గాదరి కిశోర్‌కుమార్, పైళ్ల శేఖర్‌రెడ్డి, కంచర్ల భూపాల్‌రెడ్డి, శానంపూడి సైదిరెడ్డి, నోముల భగత్, కలెక్టర్లు ప్రశాంత్ జీవన్ పాటిల్, వినయ్‌కృష్ణారెడ్డి, పమేలా సత్పతి, అదనపు కలెక్టర్లు, డీపీఓలు పాల్గొన్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గ్రీన్ కవర్ 33శాతానికి గాను కేవలం 3శాతమే ఉండడం సరికాదన్నారు. ఈసారి గ్రీన్ కవర్ పెరగడానికి వర్షాలు పడగానే హరితహారాన్ని విస్తృతంగా చేపట్టాలని సూచించారు. ఇందులో ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, అన్నివర్గాల ప్రజలు, విద్యార్థులు, యువతను భాగస్వామ్యం చేస్తూ ఉద్యమంలా చేపట్టాలన్నారు.
ఈ సీజన్లో హైవేలతోపాటు అన్నిరకాల రహదారుల వెంట, ప్రభుత్వ భూములతోపాటు పంట కాల్వలు, చెరువు శిఖాలు, వాగులు, వంకలు, నదుల గట్లు మొదలుకుని సాగర్ ఎడమ కాల్వ, ఎస్ఎల్బీసీ మెయిన్ కెనాల్, మేజర్లు, మైనర్లు ఇలా అన్ని కాల్వగట్ల వెంట మొక్కలను విరివిగా నాటేలా చర్యలు తీసుకుకోవాలన్నారు. తద్వారా ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడగలమని సూచించారు. దీనిపై త్వరలో మూడు జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహిద్దామని పేర్కొన్నారు.
పెండింగ్‌లో ఉన్న విద్యుద్దీకరణ పనులు సత్వరమే పూర్తి చేయాలని, విద్యుత్ పనులు పెండింగ్‌లో ఉండడానికి వీలులేదని స్పష్టంచేశారు. ఈ నెల 13 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్న దృష్ట్యా పాఠశాలల ప్రాంగణాలు పరిశుభ్రంగా ఉండేలా శ్రమదానాలు నిర్వహించాలని చెప్పారు. పల్లె ప్రగతిలో భాగంగా ఎమ్మెల్యేలు, అధికారులు పాఠశాలలను సందర్శించాలని, మన ఊరు-మన బడిలో ఎంపికైన పాఠశాలల్లో పనులను ప్రారంభించాలని ఆదేశించారు.