e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, January 25, 2022
Home News గులాబీ సన్నాహకం

గులాబీ సన్నాహకం

  • రేపు ప్లీనరీకి తరలివెళ్లనున్న ప్రతినిధులు
  • అనంతరం విజయగర్జనపై పూర్తి స్థాయిలో దృష్టి
  • క్యాడర్‌ను కార్యోన్ముఖులను చేసే పనిలో ఎమ్మెల్యేలు
  • జిల్లా అంతటా గులాబీ పండుగ సందడి

తెలంగాణ రాష్ట్ర సమితిలో ద్విదశాబ్ది ఉత్సవాల సందడి నెలకొంది. పార్టీ ఏర్పాటై ఇరవై ఏండ్లు గడుస్తున్న సందర్భంగా తలపెట్టిన పార్టీ ప్లీనరీతోపాటు వరంగల్‌ విజయగర్జన సభలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేసేలా ఇప్పటికే పార్టీ అధినేత కేసీఆర్‌ కార్యాచరణ ప్రకటించారు. రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, యువనేత కేటీఆర్‌ సారథ్యంలో ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వేడుకలపై దిశానిర్దేశం చేశారు. ఇక అదే ఒరవడితో మండలం నుంచి గ్రామ స్థాయి వరకు పార్టీ శ్రేణులతో సన్నాహక సమావేశాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎమ్మెల్యేలతోపాటు ఇతర ముఖ్య నేతలు
పార్టీ శ్రేణుల్లో విజయగర్జన ప్రాధాన్యతను వివరిస్తూ సమాయత్తం చేస్తున్నారు. రెండు రోజులుగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సమావేశాలతో టీఆర్‌ఎస్‌ క్యాడర్‌లో కోలాహలం నెలకొంది. ప్లీనరీ అనంతరం పూర్తి స్థాయిలో విజయగర్జన సభ విజయవంతం కోసం ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు.

నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్‌23 (నమస్తే తెలంగాణ) : టీఆర్‌ఎస్‌ పార్టీ ఇరవై వసంతాల ఉత్సవాల్లో భాగంగా వివిధ కార్యక్రమాలతో పార్టీలో పండుగ వాతావరణం నెలకొంది. పార్టీని స్థాపించి 13ఏళ్లలో ఉద్యమ లక్ష్యమైన తెలంగాణ రాష్ర్టాన్ని సాధించడం.. అధికారంలోకి వచ్చిన ఏడేళ్లలో దేశానికే ఆదర్శవంతమైన పాలన అందించడం లాంటి గొప్ప ఘట్టాలను మననం చేసుకునే దిశగా పార్టీ ప్లీనరీతో పాటు విజయగర్జన సభను నిర్వహించాలని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఈ నెల 25న పార్టీ ప్లీనరీ నిర్వహించనున్నారు. ఇందులో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రతినిధులు మాత్రమే పాల్గొననున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీ నుంచి ఎవరెవరు ప్లీనరీకి హాజరుకావాలనే దానిపై సమాచారం ఇచ్చారు. ప్లీనరీ ముగిశాక నవంబరు 15న వరంగల్‌ వేదికగా తెలంగాణ విజయగర్జన సభను ఏర్పాటు చేస్తున్నారు. దీనికి రాష్ట్రవ్యాప్తంగా 10లక్షల మంది హాజరయ్యేలా ప్రణాళిక సిద్ధం చేశారు. అందులో భాగంగా ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నేతలతో తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేల సారథ్యంలో వీటిని నిర్వహించారు. క్షేత్రస్థాయి వరకు సన్నాహక సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. దీంతో శుక్ర, శని, ఆదివారాల్లో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు.

- Advertisement -

క్షేత్రస్థాయి వరకు విస్తృత ప్రచారం.

సభపై క్షేత్రస్థాయి వరకు విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రెండ్రోజులుగా అన్ని మండలాలు, పట్టణాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆదివారం సైతం సమావేశాలు నిర్వహించనున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు స్వయంగా పాల్గొని పార్టీ శ్రేణులకు సభ ప్రాధాన్యం వివరిస్తున్నారు. ప్రతీ వార్డు, గ్రామం నుంచి ప్రజలు కదిలేలా చూడాలని సూచిస్తున్నారు. పార్టీ తరఫున ఏర్పాటు చేసే వాహనాలతో పాటు స్థానికంగా ఉన్న వాహనాలను సైతం ముందే బుక్‌ చేసుకుని సిద్ధంగా ఉండాలని చెబుతున్నారు. ఈ సందర్భంగా ఏడేండ్లుగా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. పార్టీ అధినేత కేసీఆర్‌తో పాటు కేటీఆర్‌ సభకు ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో అందరూ భాగస్వాము లవ్వాలని పిలుపునిస్తున్నారు. శనివారం నిర్వహించిన సమావేశాల్లో ఆలేరు, గుండాల మండలాల్లో ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గొంగిడి సునీత పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు. మోటకొండూర్‌లో నిర్వహించిన సమావేశంలో డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. భువనగిరి నియోజకవర్గంలో మండలాల వారీగా స్థానిక నేతలే సమావేశమై చర్చించారు. మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్‌, మునుగోడు మండలాల సమావేశాల్లో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పాల్గొని ప్లీనరీతో పాటు విజయగర్జన సభను సక్సెస్‌ చేయాలని పిలుపునిచ్చారు. నల్లగొండ నియోజకవర్గంలోని తిప్పర్తిలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి పాల్గొని సభల ప్రాధాన్యాన్ని పార్టీ శ్రేణులకు వివరించారు. మాడ్గులపల్లిలో జరిగిన సమావేశంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే ఎన్‌.భాస్కర్‌రావుతో కలిపి భూపాల్‌రెడ్డి పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మిర్యాలగూడ పట్టణ, రూరల్‌ కమిటీల సమావేశాల్లో ఎమ్మెల్యే భాస్కర్‌రావు పాల్గొన్నారు. దేవరకొండ, నాగార్జునసాగర్‌ నియోజకవర్గాల వ్యాప్తంగా సన్నాహక సమావేశాలు నిర్వహించారు. నకిరేకల్‌, తుంగతుర్తి, నాగార్జునసాగర్‌, హుజూర్‌నగర్‌, భువనగిరి ఎమ్మెల్యేలు హుజూరాబాద్‌ ఉప ఎన్నికల ప్రచారంలో ఉండడంతో ఆయా నియోజకవర్గాల్లో మండలాల వారీగా స్థానిక నేతలే సమావేశాలు నిర్వహించారు. గ్రామాల వారీగా జన సమీకరణ, వాహనాల ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు. మిగిలిన చోట్ల ఆదివారం సన్నాహక సమావేశాలు పూర్తిచేసి 25న నిర్వహించనున్న ప్లీనరీకి తరలివెళ్లాలని పార్టీ నేతలు సిద్ధం అవుతున్నారు. రాష్ట్ర స్థాయి నుంచి క్షేత్ర స్థాయి వరకు వీటిపై స్పష్టమైన కార్యాచరణ ఉండడంతో టీఆర్‌ఎస్‌లో పండుగ వాతావరణం నెలకొన్నది.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement